Friday, May 10, 2013

అనంత విశ్వంలో మనమెంత? -ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి.

 "సామాజిక అధ్యయనం లేనిదే ఏ రచయితా గొప్ప సాహిత్య రచన చేయలేడు. అలాగే, సాహిత్య అధ్యయనం లేనిదే ఏ సామాజికవేత్తా సమాజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేడు'' అంటారు ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి. ప్రొఫెసర్‌గా ఉంటూనే ఆయన అనేక కథలు, నవలలు, వ్యాసాలు రాశారు. ఎన్నో ఇతర పురస్కారాలతో పాటు 'కేతు విశ్వనాథరెడ్డి కథలు' అనే ఆయన కథా సంకలనానికి 1996లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. .
 ఆత్మగతమైన మన ఆకాంక్షలు ఎంత బలంగానైనా ఉండవచ్చు. కానీ, ప్రతిదాన్నీ డబ్బుతో కొలిచే ఒక వర్గానికిచాలాసార్లు ఆ ఆకాంక్షలు ఎంతమాత్రమూ నచ్చవు. అందుకే ఆ మార్గం నుంచి పక్కకు తప్పించే వ్యాఖ్యల్ని అది నిరంతరం చేస్తూనే ఉంటుంది. ఆ వ్యాఖ్యలే నిజమనుకుని ఒకవేళ ఆ వైపు మొగ్గు చూపితే, మనం మనం కాకుండా పోవడం ఒక్కటే చివరికి మిగులుతుంది. అవి నేను కడప ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న రోజులు. 1963 మే ప్రాంతం. వేసవి సెలవులు కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి మాండలిక వృత్తి పదసేకర ణ ప్రాజెక్టు కింద పనిచేయడం ప్రారంభించాం. అందులో భాగంగా క్షేత్రపర్యటనకు వెళ్లవలసి వచ్చింది. కుమ్మరం, వడ్రంగం, స్వర్ణకార వృత్తికి సంబంధించిన పదసేకరణ పని మీద నాలుగు రోజుల పాటు ఒక ఊళ్లో ఉన్నాం. నాలుగో రోజు ఆ పక్కనున్న ఊరు వెళ్లాలి. నా వద్ద రెండు రూపాయలే ఉన్నాయి. స్టేషన్‌కు వెళుతుంటే, ప్లాట్‌ఫామ్ మీద ఒక పుస్తకాల షాప్ కనిపించింది. దగ్గరగా వెళ్లిచూస్తే అందులో గోర్కీ రాసిన నాటకాల పుస్తకం ఉంది. వెంటనే కొనేశా. ఆ రాత్రి భోజనానికి అవసరమయ్యే ఆ రెండు రూపాయలు అలా అయిపోయాయి. మరి రాత్రి భోజనం మాటేమిటి? ఇంకేముంది? కడుపునిండా నీళ్లు తాగి గాంధీ సత్రంలో పడుకున్నా. ఈ అనుభవం మొదటిదేమీ కాదు. అలా ఎన్నో సార్లు జరిగింది. వాస్తవానికి ఈ పుస్తక ప్రియత్వం చాలా సార్లే న న్ను ఇబ్బందులకు గురిచేసింది. విద్యార్థి దశలోనూ, ఉద్యోగ దశలోనూ బాగా అప్పులు చేయడానికి అదే కారణమయ్యింది. ఈ కారణంగానే నన్ను మా ఇంట్లో వాళ్లంతా వీడో అమాయకపు చక్రవర్తి అనేవారు. బయటి వాళ్లేమో నన్ను ఓ పిచ్చిమాలోకం అన్నట్లు చూసేవారు. కానీ ఆ పిచ్చే నన్ను ఈ నాటి ఈ దశకు చేర్చిందని నేననుకుంటాను. తరువాతెప్పుడో తీసుకోవచ్చులే అనుకుని ఆ డబ్బులను భోజనానికి ఖర్చు చేయవచ్చు. కానీ, డబ్బులు నీ చేతిలో ఉన్నప్పుడు ఆ పుస్తకాలు అందుబాటులో లేకపోవచ్చు. ఏమైనా తాత్కాలిక బాధల్ని తట్టుకోలేని వారు, అద్భుతమైన ఆనందాల్ని అందుకోలేరు అని నేను బలంగా అనుకుంటాను.

జీవితం మీదే విరక్తి కలిగితే.... 
నేను ఎస్‌వి యూనివర్సిటీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు రచయిత, చరిత్ర పరిశోధకుడు బంగోరె (బండి గోపాల్‌రెడ్డి) అక్కడే ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాడు. మా మధ్య ఏర్పడిన పరిచయం క్రమక్రమంగా ఎంతో ఆత్మీయంగా మారింది. ఆయన తరుచూ మా ఇంటికి వచ్చేవాడు. మొదట్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫీసర్‌గా చేసినా ఆ తరువాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, కొంత కాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ఉంటూ చరిత్ర పరిశోధనా వ్యాసాలు రాసేవాడు. ఆ తర్వాత ప్రాజెక్టు వర్క్స్ చేయడం మొదలెట్టాడు. మిత్రుడిగా ఎంత ఆత్మీయంగా ఉండేవాడో, ఒక పరిశోధకుడిగా అంత కర్కశంగా ఉండేవాడు. ఆ మాటల్లో ఒక మొక్కవోని ఆత్మ విశ్వాసం స్పష్టంగా కనిపించేది. ఎస్‌వి యూనివర్సిటీ ప్రాజెక్టు అయిపోగానే వాళ్ల ఊరికి వెళ్లిపోయాడు. నాకు ఆయన నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో " నాకు జీవితం మీద పూర్తిగా విరక్తి వచ్చేసింది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. చిత్తూరులో ఒక సంస్థవారు నన్ను రమ్మన్నారు. కానీ, అక్కడికి వెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు'' అంటూ రాశాడు.


అప్పటి నా పని ఒత్తిళ్ల కారణంగా ఆ ఉత్తరానికి బదులు రాయకుండా ఉండిపోయాను. ఆ ఉత్తరం వచ్చిన కొద్ది రోజులకే భాక్రానగర్ ప్రాజెక్టు చెంతన బంగోరె ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వార్త విన్న నేను రెండు ముక్కలుగా తెగిపడ్డానేమో అనిపించింది. ఊహ తెలిసిన తర్వాత ఏనాడూ కంటతడి పెట్టని నేను ఆ రోజు ఒక పసిపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ దుఃఖం వెనుక పర్వతంలా నిలిచిన ఒక పెద్ద పశ్చాత్తాపం కూడా ఉంది. ఉత్తరానికి నేను వెంటనే బదులు ఇచ్చి ఉంటే బంగోరె బతికుండే వాడేమో కదా! నేను ఎందుకు రాయలేకపోయాను అని చాలా బాధపడ్డాను. 'వెంటనే తిరుపతికి వచ్చేసెయ్. నాలుగు రోజులు మాతో గడుపు. ఏం చేయాలో ఆ తర్వాత ఆలోచిద్దాంలే'' అని నాలుగు ధైర్యం వచ్చే మాటలు రాసి ఉండొచ్చు కదా! ఒక అపరాధ భావన ఇప్పటికీ నన్ను తొలుస్తూనే ఉంది. ఒక సమస్యతో సంక్షుభితం కావడం వేరు. జీవితం మీదే విరక్తి రావడ ం వేరు. బంగోరె విషయంలో నేను చేసిన నిర్లక్ష్యం నాకు గొప్ప పాఠమే నేర్పింది. కారణం ఏదైనా కావచ్చు. సాటి మనిషి జీవితం పట్ల అనాసక్తిని వ్యక్తం చేస్తున్నప్పుడు తక్షణమే తగురీతిన స్పందించడం బంగోరె మరణం తర్వాత నేను నేర్చుకున్నాను.

మేధావి వర్గంలో కొంత మంది బాగా పర్ఫెక్షనిస్టులు. ప్రతిదీ 100 శాతం పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటారు. వాళ్లు. కానీ, ప్రపంచంలో ఏదీ నూటికి నూరు శాతం పర్‌ఫెక్ట్‌గా ఉండదు కదా! ఛాలెంజ్ చేసే తత్వంతో పాటు వీరిలో ఇంపర్‌ఫెక్షనిజాన్ని ఎంతమాత్రం భరించలేనితనం కూడా ఉంటుంది. వాస్తవానికి నన్ను కూడా చిన్నప్పటినుంచి ఒక రకమైన అశాంతి నిరంతరం వెంటాడుతూనే ఉంది. ఎక్కడా రాజీపడలేని లేదా చుట్టూ ఉండే పరిస్థితులతో ఇమడలేని ఒక సంఘర్షణ నాలో ఉంటూనే ఉంది. నిజానికి ఇదొక ప్రమాదకరమైన తత్వం. కాకపోతే ఎక్కడా నెగెటివ్ భావాలకు తావు లేకుండా ఉండడమే నాలోని ప్లస్‌పాయింట్ కావచ్చు. ఏమైనా, బంగోరె మరణం. మానవ జీవన పోరాటాల మీద, ఆత్మహత్యల మీద ఎన్నో కొత్త ఆలోచనలకు తెరతీసింది. కొత్త పాఠాలు నేర్పింది. కొన్ని కొత్త బాధ్యతలను పురమాయించింది. ఇది నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం.

స్మశానంలోనూ పూలుపూస్తాయి. 
అప్పటిదాకా ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసిన నేను 1976లో ఎస్‌వియూనివర్సిటీలో లెక్చరర్‌గా ఎంపికయ్యాను. ఆ విషయం రిపోర్టు చేయడానికి ఆరోజు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మెట్లు ఎక్కుతున్నాను. అదే కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా పనిచే స్తున్న వడ్డెర చండీదాస్ మెట్లు దిగుతూ నాకు ఎదురయ్యారు. అదే యూనివర్సిటీలో నేను పిహెచ్‌డి చే సిన కారణంగా ఆయనతో నాకు ముందే పరిచయం ఉంది. రచ యితలుగా కూడా ఒకరికొకరం తెలుసు. మెట్లు ఎక్కిన నేను ఆయన కనిపించగానే ఆగాను. ఆయన నా కళ్లలోకి చూస్తూ సన్నగా నవ్వుతూనే "నువ్వు సృజనాత్మకతను సమాధిచేసే స్మశానానికి వచ్చావు'' అన్నారు.

నేను వెంటనే నవ్వేశాను కానీ, ఆ మాటలకు నా మనసులో ఏదో విస్ఫోటనం జరిగినట్లనిపించింది. ఒకరకంగా అదీ నిజమే. అకడమిక్ రంగంలోకి ప్రవేశించాక నిరంతరం విద్యార్థుల బోధన, పరిశోధనలకే పరిమితమైపోయి సృజనాత్మకతకు పెద్ద తావు ఉండదన్నదే ఆయన ఆలోచన కావ చ్చు. కాకపోతే, చండీదాస్ చివరిదాకా అకడమిక్‌గా ప్రొఫెసర్‌గానే ఉన్నా, ఆయన లోని సృజనాత్మకత మాత్రం అంతరించలేదు. యూనివ ర్సిటీలో అడుగుమోపిన తొలిరోజునే ఆయన చేసిన ఆ హెచ్చరిక నేను నేనుగా నిలబడటానికి, సాహిత్య రంగం నుంచి వైదొలగిపోకుండా కాపాడిందేమో అనిపిస్తుంది. మేధావుల మాటల్ని ఎంత తరచి చూస్తే అంత లోతైన సత్యాలు తెలుస్తాయని వడ్డెర చండీదాస్్‌ల వల్ల నాకు అనిపించింది.

అహంకారానికి విరుగుడు నేను హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో అంటే 1954లో మాకో టీచర్ ఉండేవారు. ఆయన అసలు పేరు తెలియదు గానీ, ఆయన అందరికీ తన పేరు ఫ్రాంక్లిన్-రామ్-మహమ్మద్ అని చెప్పేవారు. కుల, మత భావాలకు అతీతంగా ఉండాలన్న సంకల్పం ఆయన మాటల్లో ప్రతిధ్వనిస్తూ ఉండేది. మాకు ఆయన సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ చెప్పేవారు. ఆయన ఒక రోజు వివరంగా ఒక విషయాన్ని చెప్పి, చివరగా ఒక ప్రశ్న వేశారు. అన్నదేమిటీ అంటే "ఈ విశ్వం గురించి మీకు తెలుసు కదా! ఎన్నెన్ని నక్షత్రాలు? ఎన్నెన్ని గ్రహాలు? అసంఖ్యాకమైన ఆ గ్రహాల్లో మన భూగోళం ఒకటి కదా! ఈ భూగోళంలో ఎన్నో ఖండాలు ఉన్నాయి. ఒకానొక ఖండంలో మన దేశం ఉంది కదా. మళ్లీ దేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో జిల్లాలు, ఎన్నోగ్రామాలు ఉన్నాయి. ఎప్పుడైనా మీ గ్రామం వెళ్లి ఒక చోట కూర్చుని ఆకాశంలోకి అలా చూస్తూ ఆలోచించండి.

ఈ అనంత విశ్వంలో నువ్వెంత?''అంటూ ఒక్కొక్కరి కళ్లలోకి పరిశీలనగా చూశారు. నా మిగతా క్లాస్‌మేట్స్ మాట ఎలా ఉన్నా, నన్ను మాత్రం ఆ ప్రశ్న నిలువునా చీల్చివేసింది. అహంకారానికి ప్రపంచంలో అంతకన్నా పెద్ద విరుగుడు ఏముంటుంది? ఆ తరువాత రోజులు వారాలు కాదు, కొన్ని నెలల పర్యంతం నా ఆలోచనలు ఆ విషయం చుట్టే తిరుగుతూ ఉండేవి. ఈ రోజుకు కూడా ఎప్పుడైనా మనసులో ఏమూలనో కాస్తంత అహంకారం చోటుచేసుకుందామని చూస్తే వెంటనే ఆయన మాటలు చెంప చెళ్లుమనిపించినట్లు వినబడతాయి,జ్ఞానం మనిషిని ఆకాశాన్ని చేస్తుంది. అహంకారం ఆకాశాన్ని కూడా దుమ్మూ ధూళిలో కలిపేస్తుంది. నా జీవనయానాన్ని నిండుగా నడిపించే సత్యం కూడా ఇదేనేమో!

- బమ్మెర
ఫోటోలు: రాజ్‌కుమార్ (Andhra jyothy daily 10 May 2013)


No comments:

Post a Comment

Write Your Comments here: