ముందుమాటలు, సమీక్షలు అవసరం లేని కథారచయిత కేతు విశ్వనాథరెడ్డి. కథారచయితగా ఆయనకు
పేరు పెట్టాల్సిన అవసరం లేదు. గత నాలుగున్నర థాబ్దాలుగా ఆయన కథలు రాస్తూనే
వున్నారు. ఇంత సుదీర్ఘకాలం ఒక సృజనాత్మక ప్రక్రియను కొనసాగించడం అంత సులభం కాదు.
అలా కొనసాగించడానికి కొన్నింటిని సాధన చేయవలసి వుంటుంది. ముఖ్యంగా గుండెతడి
ఆరకుండా, రచయిత ఎప్పటికప్పుడు 'ఆత్మరక్షణ' చేసుకోవాల్సి వుంటుంది.
మానవసంబంధాలు, భౌతికావసరాలు, వెంపర్లాటలు వ్యక్తిని రాయిని చేసి సమాజం గురించి, ఇరుగుపొరుగువారి గురించి ఆలోచించకుండా కట్టడి చేసే ప్రయత్నం జీవితంలో
ప్రతిక్షణం జరుగుతూనే ఉంటుంది. అందుకే అంతరంగలోకాలను భద్రపరుచుకుంటూ, గుండెతడిని ఆరకుండా నిత్యం తనను తాను పొతం పెట్టుకునేవారే
కథాప్రక్రియలో విశ్వనాథరెడ్డిలాగా కొనసాగగలుగుతారు. గతంలో మిగిలిపోకుండా
వర్తమానంలో పచ్చని మనిషిగా సంచరిస్తున్న విశ్వనాథరెడ్డి 1998, 2003 మధ్య రాసిన కథల పుస్తకాన్ని పాఠకులకు అందించారు.
ఈ పుస్తకంలో 12 కథలున్నాయి. రాయలసీమకు సంబంధించినంతవరకు నీళ్లకరువు, ముఠాకక్షలు ప్రధానసమస్యలు. కరువును పెనవేసుకునే ముఠాకక్షలు బలాన్ని
పెంచుకుంటున్నాయి. ఈ రెండు అంశాలను ప్రధానం చేసుకుని రాయలసీమ జనజీవితదృశ్యాలను
చిత్రించారు కేతు విశ్వనాథరెడ్డి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల నేపథ్యం
రాయలసీమ జనజీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నదనే విషయాన్ని ఈ పుస్తకంలోని
చాలా కథలు తెలియజేస్తాయి. విశ్వనాథరెడ్డికి పల్లెజీవితంపట్ల మొగ్గు ఎక్కువ. అంటే
తన మూలాలను మర్చిపోని కథారచయిత ఈయన. దేన్ని విశ్లేషించినా పల్లెజీవితాలు
బాగుపడాలనే దృష్టికోణాన్ని ఆయన వదులుకోలేదు. నగరజీవితాలకూ పల్లెజీవితాలకూ మధ్య, అమెరికాలోని ప్రవాసభారతీయుల జీవితాలకూ రాయలసీమ పల్లె జీవితాలకూ మధ్య
పోలిక తెస్తూ పల్లెజీవితాలు ఇంత దుర్భరంగా ఎందుకు మారుతున్నాయనే రహస్యం గుట్టు
విప్పారు రచయిత. అదే సమయంలో తన తరానికి, తన మనవలతరానికి మధ్య సంబంధిన్ని నెలకొల్పాలనే ఒక గాఢమైన తాపత్రయం
కేతు విశ్వనాథరెడ్డి కథల్లో అంతర్లయగా సాగుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ
సంబంధం మానవజీవితాన్ని, ముఖ్యంగా రాయలసీమ గ్రామీణ
ప్రజల జీవితాలను బాగుపరిచేందుకు ఉపయోగపడే ఆలోచనల వైపు సాగేదిగా ఉండాలని రచయిత
ఆశిస్తున్నట్లు మనం గమనించవచ్చు. పోలికలు, మాయపొరలు, రెండు ప్రపంచాలమధ్య, దగ్గరైన దూరం దూరమైన దగ్గర, పొడినిజం, విరూపం కథలను ఇందుకు
ఉదాహరణగా చెప్పవచ్చు. ముఠాకక్షలకు పార్లమెంటరీ రాజకీయాలు ఎలా ఆజ్యం పోస్తున్నాయో, ప్రజలకు మేలు చేసేవారిపట్ల ఎలా కిరాతకంగా హతమారుస్తున్నాయో విశ్వనాథ
రెడ్డి సమర్థంగా చిత్రించారు.
అధికార రాజకీయాలు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి
పని చేయడం లేదనే విషయాన్ని ఆయన కథల్లో అంతస్సూత్రంగా చెప్పుకుంటూపోయారు. 'పొడినిజం' కథ అందుకు మంచి ఉదాహరణ.
గంగను కిందికి భగీరథుడిలా నేల మీదికి దించితే తాత చెప్పిన 'పాడు కాలం' నశించి మంచి కాలం వస్తుందనే
ఆలోచన గంగాధరకు అర్థమవుతుంది. ఆ గంగను ఎవరు దించాలంటే తాను విన్న కథల్లో లాగా
రాజులు ఆ మంచిపనులు చేయాలని గంగాధర అనుకుకంటాడు. అలాంటి భగీరథుడు ఉంటాడనే నమ్మకం
నుంచి, ఇప్పుడు అలాంటి రాజులు లేరు, కదా ఎవరు సమస్యను పరిష్కరించాలనే విచికిత్సలో పడతాడు ఆ బాలుడు.
ఇప్పుడున్నది మంత్రులు కదా అంటూ వారు ఆ పని చేయరనే విషయాన్ని గంగాధర ఆలోచనల్లోనే
రచయిత ధ్వన్యాత్మకంగా చెప్తారు. అలా చెపుతూ తమ కష్టాలను తీర్చుకోవడానికి మంచి పని
చేయాలనే ఆలోచన గంగాధరకు వచ్చినట్లు రచయిత కథను ముగిస్తారు. ఇందులో భవిష్యత్తరాల
పట్ల రచయిత ఒక ఆశావహదృక్పథాన్ని పెంపొందించుకోవడం మనం చూస్తాం. ఇటువంటి ఆశావహ
దృక్పథమే ఈ పుస్తకంలోని అన్ని కథల్లో చూస్తాం.
పిల్లల మనస్తత్వాన్ని, పిల్లల ఆలోచనా స్థాయిని కేతు విశ్వనాథరెడ్డి బలంగా పట్టుకున్నారు.
వారి చేత పెద్ద పెద్ద మాటలు మాట్లాడించకుండానే చాలా పెద్ద విషయాలను ఆయన సునాయసంగా
చెప్పగలిగారు. ఈ విషయంలో కథకుడిగా, కథా నిర్మాణ వ్యూహం తెలిసినవాడిగా ఆయన సత్తా ఏమిటో చాటుకున్నారు.
పొడినిజం కథతో పాటు పోలికలు, దగ్గరైన దూరం దూరమైన దగ్గర
కథలు ఇందుకు అద్దం పడుతున్నాయి. పోలికలు కథలో తాతామనవళ్లకు మధ్య ఉండే సహజసిద్ధమైన
అనుబంధాన్ని రాయలసీమ రైతుల జీవితాలు పొడివారిపోతున్న విషయాన్ని సహజసిద్ధంగా ఆవిష్కరించడానికి
రచయిత వాడుకున్నారు. నగరజీవితాన్ని తన ఊరి జీవితంతో పోల్చి చూసే శంకరయ్య తాత
ఆలోచనలను, మాటలను మనవడి దృక్కోణం
నుంచి విశ్లేషించుకుంటూ పోతారు రచయిత. ఆ మనవడు మీసాలు తిరిగిన యువకుడేం కాదు, చిట్టిపొట్టి చేతుల చిన్నారి. ఈ ఇద్దరూ తాము చూస్తున్న, వింటున్న విషయాలను తమ తమ జీవితపరిధిలోంచి, తమకు తెలిసిన, అనుభవం ఉన్న జీవితంలోంచి
విశ్లేషించుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. వారు అర్థం చేసుకోవడానికి
చేసే ప్రయత్నంలో పాఠకులకు కథ అంతస్సారం ఒంటబట్టి రాయలసీమ పల్లెజీవితాలు రూపుకట్టి
దిగులు మేఘాలు ఆవరించి, గుండె గొంతులోన కొట్లాడటం
మొదలు పెడుతుంది. సాహిత్యానికి ఇంతకాన్న కావాల్సిన ప్రయోజనం ఏమిటి?
దగ్గరైన దూరం దూరమైన దగ్గర కథలో అమెరికాలో
పుట్టిన రాయలసీమ పాప తన సొంత వూరికి వచ్చి ఇక్కడి పరిస్థితులను అర్థం
చేసుకోవడానికి, అమెరికాలోని పరిస్థితులకూ
ఇక్కడి పరిస్థితులకూ మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడానికి పడే తపన రచయిత
చిత్రించారు. ఆఖరుకు ఆ పాప పడే సంఘర్షణ నుంచి, తన సంఘర్షణ నుంచి ఒక పరిష్కారాన్ని కనుక్కునే ప్రయత్నంలో ఒక
నిర్ధారణకు రాకపోవడాన్ని ఆ పాప మాటల్లోనే చెబుతూ రచయిత కథ ముగిస్తాడు. ''ఇక్కడ బాగుంది, అమెరికాలో మాదిరి అన్నీ
లేవు, ఎందుకు?'' అని ఆ పాప ప్రశ్నించుకుంటుంది. ఈ పాప వేసుకున్న ప్రశ్నకు మాటల్లో
సమాధానం చెప్పడం సాధ్యం కాదు. అది మాటలకు అందని అనుభూతిని మాత్రమే మిగిలిస్తుంది.
ఇలా పాఠకులు అనుభవించి, పలవరించడానికి రచయిత అన్ని
కథల్లోనూ అవకాశం కల్పించారు. పాఠకుల పట్ల గౌరవభావం, పాఠకులస్ఠాయిపై నమ్మకం కలిగిన రచయితకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.
విడమర్చి చెప్పాల్సిన విషయాలను, రచయిత తాను చెప్పదలుచుకున్న
విషయాలను పాఠకుడి ఆలోచనకే వదిలేయడం ద్వారా కథారచయితగా విశ్వనాథ రెడ్డి గొప్ప ఫలితం
సాధించారు.
ఒక వాల్మీకి, ముఖదర్శనం, కాంక్ష, అమ్మవారి నవ్వు, సంకటవిమోచిని కథలను
ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటిలో అమ్మవారి నవ్వు బాగా కుదిరిన కథ. ఒక చక్కటి
కావ్యంలా ఈ కథ సాగుతుంది. ప్రపంచంలో, ముఖ్యంగా దేశంలో నెలకొన్న పరిస్థితులకు కారణం ఎక్కడుందో, పరిష్కారం ఏమిటో సూచించిన కథ ఇది. హిందూముస్లింల మధ్య విద్వేషాలను
రెచ్చగొట్టే రాజకీయాల గుట్టును పాతర వేసిన కథ. జాఫర్ పూలతో రూపుదిద్దిన మూర్తులను
చూసి ''.... ఒక గొప్ప హిందూ సంస్కారం ఈ
మూర్తుల్లో కనిపిస్తోంది. అమ్మవారి పెదాల మధ్య విరిసీవిరియని ఆ నవ్వును చూపడం
సాధకులైన మన హిందూ కళాకారులకే సాధ్యం'' అని అంటూ ''అ పుష్ప ప్రతిమలను ఎవరు
రూపొందించారు?'' అని అడిగిన సుందర
రామానందులుకు హరీశ్వర్ ''మా జాఫర్ చిన్నాయన'' అని ఇచ్చిన సమాధానం ఒక చెంపపెట్టులాంటిది. రామానందులు ఏ రాజకీయాలకు
ప్రాతినిధ్యం వహిస్తున్నాడో విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. సంకటవిమోచిన సామాజిక
వాస్తవాలను కళాత్మకంగా చెప్పిన కథ. ఇందులోని చౌడేశ్వరి పాత్ర రిజర్వేషన్ల కారణంగా
అగ్రకులాలవారు దిగువకులాలపై పెంచుకునే ద్వేషానికి సమర్థంగా సమాధానం చెపుతుంది.
చౌడేశ్వరి పాత్రను రచయిత చాలా ఉదాత్తంగా చిత్రించి మంచి ప్రయోజనం సాధించారు. 'వాల్మీకి' కథ ఒక పురాగాథ వంటిది.
ఇటువంటి కథల ద్వారా మన వారసత్వ జాడలు తెలుసుకుని మానవజీవితంపట్ల మమకారాన్ని
పెంచుకోవడానికి తోడ్పడతాయి. ముఖదర్శనం, కాంక్ష కథలు సామాజికరుగ్మతలకు చికిత్స చేసే కథలు.
విశ్వనాథ రెడ్డి సమాజంలో సాంకేతిక, సమాచార విప్లవం తెచ్చిన మార్పుల నేపథ్యంలోంచి పల్లెజీవితాలు మరింత
దిగజారుతున్న వైనాన్ని తన కథల్లో రూపుకట్టారు. తద్వారా జరగాల్సిన నిజమైన
అభివృద్ధికి, పాలకులు చెప్పే బూటకపు
అభివృద్ధికి మధ్య గల తేడా గుట్టు విప్పారు. ఈ కథలు చదివితే ఏ పాత్ర మీద కూడ మనకు
విద్వేషం కలగదు, పైగా మానవులందరిపట్ల ప్రేమ
పుడుతుంది. మనం ఎవరి వెంట ఉండాలో, ఎవరిని సమర్థించాలో, ఏ వర్గాన్ని వదిలేయాలో తెలియజేసే కథలు ఇవి. ఆర్థిక అసమానతలు, సామాజిక అంతరాలు ఎలా సమాజంలో హెచ్చుతగ్గులకు కారణమవుతాయో ఈ కథలు
తెలియజేస్తాయి.
రచనా విధానంలో కొడవటిగంటి కుటుంబరావు
సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న కేతు విశ్వనాథ రెడ్డి కథల్లో అనవసర వాక్యాలు, పదాలు వుండవు. సమాజ పరిస్థితులను, కార్యకారణ సంబంధాలను దారంలో పోగులాగా అల్లుకుపోతూ సృజనాత్మక సాహిత్యం
నిర్వర్తించాల్సిన ప్రయోజనాన్ని ఈయన కథలు నెరవేరుస్తాయి. కుటుంబరావు మధ్యతరగతి
సమాజాన్ని విశ్లేషించడానికి పూనుకుంటే విశ్వనాథ రెడ్డి పల్లెజీవితాలను విశ్లేషించే
పనికి పూనుకున్నారు. ఇప్పుడిప్పుడే మధ్యతరగతిగా, నయాసంపన్నవర్గంగా ఎదుగుతన్న సమూహాలను కూడా విశ్వనాథ రెడ్డి
చిత్రీకరించారు. అయితే ఇదంతా పల్లె దృక్కోణం నుంచి సాగుతుంది.
విశ్వనాథరెడ్డి ఇంకా కథలు రాస్తూనే ఉండాలని
అనిపించడం ఈ కథలు చదువుతుంటే కలిగే భావన. అది సాహిత్యకారుతలకు ఆయన అందించిన అంశం.
- కాసుల ప్రతాపరెడ్డి
No comments:
Post a Comment
Write Your Comments here: