Friday, November 22, 2013
Monday, August 5, 2013
ప్రాంతీయత వల్ల కథ విశాలమయింది: కేతు విశ్వనాథ రెడ్డి
సాహిత్యంలో ఇప్పుడు కథా యుగం నడుస్తోందనే వాదనను మీరెలా సమర్ధిస్తారు?
సాహిత్యంలో యుగ విభజన వ్యక్తుల
పరంగా గానీ, ప్రక్రియల పరంగా
గానీ నాకిష్టం లేని మాట.
మీ ప్రశ్నలోని
అంతరార్థాన్ని బట్టి చూస్తే కవిత్వం కంటే కథా రచనకు ఆదరణ ఎక్కువైనదనుకోవాలి. లేదా
కథా రచన పట్ల, కథా పఠనం పట్ల ఆసక్తి పెరిగిందనుకోవాలి. దీనికి కారణం వచన
వ్యాప్తి. కవిత్వంలో ఇమడ్చలేని ప్రజల ఆకాంక్షలను, మానవ సంబంధాలను, అనుభవాలను స్వీయానుభావాన్నుంచి, పరిశీలన నుంచి, జ్ఞానం నుంచి చిత్రించాలనే కథా రచయితల ఆర్తి. వచన
వ్యాప్తి అంటున్నామంటే
మనం మాట్లాడుకునేది వచనం. బోధనలో వచనం. ప్రసార సాధనాల్లో ఎక్కువగా అందిస్తున్నది వచనం. నిర్ణీత
ప్రయోజనాల కోసం మనం వాడేది వచనం. ఇంత వచన వ్యాప్తి వున్నప్పుడు సృజనాత్మక రచయితలు కూడా తమ
అభివ్యక్తికి వచనాన్ని
ఒక వాహికగా ఎంచుకోవడంలో ఆచ్చర్యం లేదు. అట్లని కవిత్వం వెనకబడినట్లు నా ఉద్దేశం కాదు. కవిత్వ
సంకలనాలు చాలా వస్తున్నాయి. కవిత్వ వస్తువు మీద, రూపం మీద శ్రద్ధ వున్న మంచి కవులు మనకు లేకపోలేదు. ఐతే కొత్త కొత్త సామాజిక వర్గాల
నుంచి, ప్రాంతాల నుంచి, ఉప ప్రాంతాల నుంచి చదువుకున్న వారి సంఖ్య పెరిగింది.
వారిలో కొందరు సృజనాత్మక కల్పనా సాహిత్యం మీదా, ముఖ్యంగా కథల మీద మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ శ్రద్ధ
పెడుతున్నారు.
కేతు విశ్వనాథ రెడ్డి |
- సాధారణంగా ఏ వాదమైనా లేక ఉద్యమమైనా మొదట కవిత్వంలో విస్తరించి ఆ తరువాత ఇతర ప్రక్రియల్లోకి వ్యాపించే ఒక భూస్వామిక లక్షణం తెలుగు సాహిత్యంలో ఉంది. ఈ కోణంలో ప్రాంతీయ అస్తిత్వ కథలు వస్తున్న విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?
ఇది భూస్వామిక లక్షణం కాదు. కాక
పోతే కవిత్వానికి ఉన్నంత చరిత్ర కవిత్వేతర ప్రక్రియలకు లేదు. ఉద్యమాలకు కవులు తక్షణం
స్పందిస్తారు. వారి గాఢమైన ఆవేశ బలం కావచ్చు. కవిత్వ నిర్మాణానికి అవసరమయ్యే స్పందనల చిత్రణ శబ్ద చిత్రాల రూపంలోనో,
భావ చిత్రాల రూపంలోనో, భావ శబలత రూపంలోనో అది వ్యక్తం అవుతుంది. ఇతర వచన ప్రక్రియలకు ఇది
కొంత ఆలస్యంగా విస్తరిస్తుంది. ప్రాంతీయ అస్తిత్వ కథల విషయంలో కూడా ఇది వాస్తవం.
దీనికి కారణం ఈ అస్తిత్వ కథ లాంటివి తక్షణ స్పందనకు వీలైన నిర్మాణాలు కాదు.
- ప్రాదేశిక నిర్దిష్టతతో తెలుగు కథను ఎట్లా చూడాలి?
తెలుగు సాహిత్యకారులు, విమర్శకులు సాధారణంగా మూడు మాటలు
వాడుతుంటారు. అవి
స్థానీయత, ప్రాదేశికత, ప్రాంతీయత. స్థానీయత కంటే ప్రాదేశికతకు,
ప్రాంతీయతకు మరింత విశాలమైన నేపథ్యం
వుంటుంది. ప్రాదేశికత, నిర్దిష్టత అంటున్నప్పుడు
ప్రధానమైన ఆరేడు లక్షణాలని మనం దృష్టిలో ఉంచుకొవాలి. 1. ప్రదేశం/ప్రాంతం, భౌతిక జీవితం . అంటే భౌగోళిక స్థితిగతులు, పర్యావరణం, జలవనరులు, అటవీ సంపద, వృక్ష సంపద,
ఖనిజ, ఇంధన సంపద, నేల తీరులు, వర్షపాతం,
పంటలు, కరువు కాటకాలు, వరదలు వీటి మధ్య ప్రాంతీయ, ఉప ప్రాంతీయ భేదాలు . 2. సామాజిక శ్రేణులు, (మతం, కులం,
ఉపకులాలు, తెగలు)సామాజిక విభజన, సామాజిక వైరుధ్యాలు, అసమానతలు, ఆదిపత్య
వర్గాల వైఖరులు, ప్రతిఘటనలు,
ఉద్యమాలు. 3. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలు. చలనం, అభివృద్ధి,
స్వభావం, పరిశ్రమలు, వ్యవసాయం, వృత్తుల
సంక్షోభం, చరిత్ర, ఇటీవలి సామాజిక పరిణామాలు. 4. భాష, అధికార భాష, భాషా
భేదాలు, మాండలికాలు, ఉపమాండలికాలు, ఆదివాసి భాషలు, అన్యభాషా వ్యవహర్తలు. 5. మహిళా సమస్యలు. 6. సాంస్కృతిక పరమైన అంశాలు, తిండి తిప్పలు, వేష ధారణ, సంప్రదాయాలు,
మత విశ్వాసాలు, పండగలు, కళా సాహిత్య రూపాలు. 7. ఒక నిర్దిష్ట ప్రాంతం నుంచి ప్రవాసం వెళ్ళిన వారి అస్తిత్వ సమస్యలు. ఈ అంశాలు
ప్రాదేశిక నిర్దిష్టతను ఎత్తి చూపుతాయి. ఈ దృష్టితో తెలుగు కథల్లో ఏ మేరకు ఆ ప్రతిఫలనం జరిగిందో
మనం పరిశీలించవచ్చు.
- ప్రాంతీయ అస్తిత్వాన్ని ఎలా నిర్వచించాలి? ప్రాంతీయ అస్తిత్వ స్పృహతో కథలు వెలువడడం ముందడుగా? వెనుకడుగా ?
అస్తిత్వం అనే మాటను మనస్తత్వ
శాస్త్రజ్ఞులు, సామాజిక
శాస్త్రజ్ఞులు , తత్వశాస్త్రజ్ఞులు
నిర్వచిస్తున్న క్రమంలో అస్తిత్వం
వ్యక్తి జీవ లక్షణం, జన్యు
లక్షణం, జన్యుప్రేరితం, గాయపడిన వ్యక్తి స్వభావం, సామాజిక ప్రాంతీయ సాలిడారిటికి సంకేతం అని కూడా
భావిస్తున్నారు. అస్తిత్వం
అనే మాటకు ఉనికి, గుర్తింపు అనే
అర్థాలున్నాయి. “ఐడెంటిటి”
అనే ఇంగ్లీష్ మాటకు సమానార్థకంగా అస్తిత్వం అనే మాటను విరివిగా ఉపయోగి
స్తున్నారు. ఉదాహరణకు దళిత అస్తిత్వం, మైనారిటీ అస్తిత్వం, మహిళల
అస్తిత్వం, ప్రాంతీయ అస్తిత్వం.
ఒక భౌగోళిక
ప్రాంతం లేదా ఉప ప్రాంతంలోని లేదా భాషా ప్రాంతంలోని ప్రత్యేక
లక్షణాలను, భావాలను, విశ్వాసాలను ప్రతిఫలించే నిర్దిష్ట లక్షణాలను
ప్రాంతీయ అస్తిత్వంగా
స్థూలంగా నిర్వచించవచ్చు. ప్రాంతీయ అస్తిత్వ స్పృహతో వెలువడుతోన్న కథలు వెనుకడుగు మాత్రం కాదు.
అవి సమాజ అవగాహనకు మునుపటికంటే ఎక్కువగా తోడ్పడుతున్నాయి. ఒక ప్రాంతం ప్రత్యేక
లక్షణాలను ఆ ప్రాంతంలోని వివిధ సామాజిక సముదాయాల అవగాహనను పెంచుతుండడం
చూస్తూనేవున్నాం. ఉదాహరణకు తెలుగు ప్రాంతంలోని ఆదివాసీల జీవన సమస్యలు, జీవన వాస్తవికత కథల్లో విరివిగా వెలువడడం ఈ రెండు మూడు
దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. అలాగే ముస్లిం జీవితాలైనా, దళిత జీవితాలైనా, మహిళల జీవితాలైనా మైనారిటీల జీవితాలైనా.
ఇది మన సమాజ అవగాహనను తప్పక పెంచేదే కదా. అంతేగాక
సమాజంలో సమానత్వాన్ని/సమభావాన్ని,
సౌభ్రాతృత్వానికి ఈ కథల్లోని సంవేదనలు, స్పందనలు. తోడ్పడుతాయి. ఇది మనిషి చేసుకున్న
మానవ సంస్కార పరిణామంలో ఒక దశ. ఒక చిన్న ముందడుగు..
- ప్రాంతీయ అస్తిత్వానికి ఎందుకింత గుర్తింపు లభిస్తోంది?
ఇది అస్తిత్వ చలనాల దశ. తెలుగు
మాట్లాడే ప్రాంతంలోని ప్రజా సముదాయాల జీవ లక్షణాలను భావాలను ఇతర ప్రాంతాల కంటే
భిన్నమైనవి అనుకున్న సామాన్య లక్షణాలను ఒక్కోసారి నిర్దిష్ట లక్షణాలకు కూడా
(స్థానీయ లక్షణాలు ) రచయితలు స్పందిస్తున్న
దశ ఇది. పాఠకులు కానీ, విమర్శకులు
కానీ వీటిని గురించి
ఆలోచించాల్సిన దశ కూడా ఇదే.
- ప్రాంతీయ అస్తిత్వ కథ వెనుక జాతీయ అంతర్జాతీయ కారణాలు లేదా ప్రభావాలు ఏమిటి?
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో
అస్తిత్వ సమస్యలున్నాయి. అమెరికా లో నల్ల జాతీ ప్రజలది అస్తిత్వ సమస్య. బంగ్లాదేశ్
ఏర్పడడానికి భాష ఒక అస్తిత్వంగా ఏ
రకంగా పని చేసిందో మనకు తెలుసు. లాటిన్ అమెరికన్,ఆఫ్రికా దేశాల్లోని అస్తిత్వ సమస్యలతో కూడా మన కథా రచయితలకు
కొంత మందికైనా అంతో ఇంతో అవగాహన లేకపోలేదు. ఇవి పరోక్ష కారణాలు, ప్రభావాలు ఏవైనా మన రచయితలూ మన వాస్తవికత నుండే కథలను రాస్తున్నారు.
- రాయలసీమలో కవిత్వం కంటే కథే బలంగా వస్తోంది దీనికి ప్రాదేశికతే కారణమా?
ప్రాదేశికత కారణం కాదు. అక్కడి
జీవితంలో సామాజిక, రాజకీయ
ఉద్యమాలు ఒక రకంగా
చాలా చాలా తక్కువే. దీనికి తోడు అక్కడ పద్య ప్రియత్వం ఎక్కువ. అంతకు మించి ఆధునిక వచన
కవిత్వానికి అవసరమైన వస్తు రూపాలు చాలా తక్కువ మందికే అబ్బాయి. కవిత్వ విషయంలో సంప్రదాయ విచ్చిత్తి
జరగవలసినంత జరగలేదు.
- ప్రాంతీయ అస్తిత్వం అనేది కథా శిల్పానికి ఏమైనా మెరుగులు పెట్టిందా?
ఏ కథకైనా వస్తువెంత ముఖ్యమో,
శిల్పమూ అంతే. ప్రాంతీయ అస్తిత్వం అంటున్నప్పుడు మనం అందులో భాష ఉందనే విషయం
మరువరాదు. ఈ భాషా శైలుల విషయంలో రచయిత వాడే కథన శైలి,పాత్రల భాషా శైలుల విషయంలో ప్రాంతీయ అస్తిత్వాన్ని చిత్రిస్తున్న కథకులు మరింత విశాలం
చేశారు.తర్వాత చాలా
కొద్ది మందే కావచ్చు
మానసిక ఘర్షణను, మానవ చలనాలను
చిత్రించడంలో శ్రద్ధ చూపారు.
- కవిత్వంలో ఆధునికానంతరవాదం వస్తున్నప్పుడు ఆ ప్రభావం కథా సాహిత్యం మీద ఏ మేరకుంది?
కవిత్వంలో ఆధునికానంతరవాద పరిశీలన
అఫ్సర్ “ఆధునికత- అత్యాదునికత”
( 1992) వ్యాసాలలోనూ, దానికి తిరుపతిరావు ముందు మాటలోనూ
వారు చేసినట్లు గుర్తు. నిజానికి ఈ వాదానికి సంబంధించిన
జ్ఞానాన్ని, సిద్ధాంతాన్ని,
మూలగ్రంథాల అనువాదాలు గానీ, స్వంత రచనలు గా గానీ వచ్చిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పాలి. కన్నడ
విమర్శకులు దీన్ని నవ్యోత్తర వాదం అంటున్నారు. ఇటీవలే అస్తిత్వాలను, అస్తిత్వ చరిత్రను చిత్రించే కథలను ఆధునికానంతర ధోరణి కింద చూస్తున్నారు.
నేను కూడా మొన్న మొన్నటి దాకా దళితులు, మైనారిటీలు, బహుజనులు,
మహిళలు వీరి శకలీకరణ జీవితాల్ని
చిత్రించే కథలు ఆధునికానంతరవాదానికి చెందినవనే అనుకున్నాను. ఇది ఒక రకంగా సిద్ధాంత
దృష్టి కాదు.
రాజకీయ దృష్టి.
ఆధునికానంతరవాదం అంతః సారాన్ని సర్వ
విషయ సాపేక్షతను అంతరంగ చలానాలను చిత్రించడానికి ప్రయత్నించిన వి. చంద్రశేఖర్
రావు, అఫ్సర్, మధురాంతకం నరేంద్ర లాంటి రచయితలను వేళ్ళ మీద
లెక్కపెట్టవచ్చు. ఇటీవలే ఆధునికానంతరవాదం కంటే భిన్నమైన ఆధునికత, ఆధునీకరణ సాక్ష్యంగా నిలిచే అనుక్షణిక నవీన
మోహిని ద్రవాధునికత
(లిక్విడ్ మోడ్రనిజం)-పోలిష్ సామాజిక
తత్వవేత్త బౌమన్ ను పాపినేని
శివశంకర్ పరిచయం చేశాడు. చలనం, అస్థిరత
లక్ష్యంగా సాగే ఈ ద్రవాధునికత కథా రచనలో ఆధునికోత్తరవాదం లాగే అనే ఒక ఆకర్షణీయమైన
గుర్తుగానే మిగులుతుందేమో
చూడాలి. వీటి విషయంలో చాలా మందితో పాటు నాదీ పరిమితమైన జ్ఞానమే. ఇది విశాలం చేయడానికి
ఆధునికానంతరవాదాన్ని ప్రతిఫలించే కథలను ఒక సంకలనంగా తీసుకురావాల్సిన అవసరమెంతైనా ఉంది.
అస్తిత్వ వాదాన్ని తెలుగులో సమూహాల గుర్తింపు
వాదంగా వాడుతున్నాం. ఎగ్జిస్టెన్షియలిజం కు సమానంగా వాడుతున్నాం.
జీన్ పాల్ సార్త్రే, మార్షల్ ప్రౌస్ట్ వంటి వారు ప్రతిపాదించిన
అస్తిత్వ వాదంలో
కీలకాంశం మనిషికి ఇచ్చా శక్తి ఉంది. తానూ చేసే పనులకు తానే బాధ్యుడు. ఐతే- అర్థం పర్థం లేని ప్రపంచంలో.
ఏమైనా ఈ రకమైన అస్తిత్వవాదానికి ఆధునికానంతరవాదం ఏ అంశాల్లో విభేదించిందో
తెలిస్తే మనకు మంచిది. తెలుగులో సాహిత్య పరిభాష అభివృద్ధికి ఈ ప్రయత్నాలు మరింత దోహదం చేస్తాయి.
- మిగిలిన భారతీయ భాషల కథలతో పోల్చినపుడు తెలుగు కథా స్థానం ఎక్కడుంది? దీన్ని ఎట్లా చూడాలి?
ఆధునిక భారతీయ భాషల కథల్ని మనం
ఆంగ్లం ద్వారానో, తెలుగు
ద్వారానో చదువుకుంటున్నాం.
కానీ పరిశీలించడానికి తగినంత విస్తారంగా ఈ కథా సాహిత్య సామగ్రి లోటు ఉండనే ఉంది. నేను పరిశీలించినంత
వరకు తెలుగు కథ మెచ్చుకోదగిన స్థాయిలోనే ఉంది-
అన్ని మంచివనుకునే ముగ్ధత్వం వదిలిపెడితె. ఏది ఏమైనా తెలుగు కథలు విరివిగా ఇంగ్లీష్ లోకి ఇతర
ప్రాంతీయ భాషల్లోకి వెళ్తే ఆ సాహిత్యకారులు ఏమనుకుంటారో కూడా మనం పట్టించుకోవాల్సి
ఉంది.
ఇంటర్వ్యూ :
వెల్దండి శ్రీధర్
సారంగ బుక్స్ సౌజన్యంతో..
సారంగ బుక్స్ సౌజన్యంతో..
Friday, June 28, 2013
Friday, May 10, 2013
అనంత విశ్వంలో మనమెంత? -ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి.
"సామాజిక అధ్యయనం లేనిదే ఏ రచయితా గొప్ప సాహిత్య రచన చేయలేడు. అలాగే,
సాహిత్య అధ్యయనం లేనిదే ఏ సామాజికవేత్తా సమాజాన్ని సంపూర్ణంగా అర్థం
చేసుకోలేడు'' అంటారు ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి. ప్రొఫెసర్‌గా ఉంటూనే ఆయన
అనేక కథలు, నవలలు, వ్యాసాలు రాశారు. ఎన్నో ఇతర పురస్కారాలతో పాటు 'కేతు
విశ్వనాథరెడ్డి కథలు' అనే ఆయన కథా సంకలనానికి 1996లో కేంద్ర సాహిత్య అకాడమీ
అవార్డు కూడా లభించింది. .
ఆత్మగతమైన మన ఆకాంక్షలు ఎంత బలంగానైనా ఉండవచ్చు. కానీ, ప్రతిదాన్నీ
డబ్బుతో కొలిచే ఒక వర్గానికిచాలాసార్లు ఆ ఆకాంక్షలు ఎంతమాత్రమూ నచ్చవు.
అందుకే ఆ మార్గం నుంచి పక్కకు తప్పించే వ్యాఖ్యల్ని అది నిరంతరం చేస్తూనే
ఉంటుంది. ఆ వ్యాఖ్యలే నిజమనుకుని ఒకవేళ ఆ వైపు మొగ్గు చూపితే, మనం మనం
కాకుండా పోవడం ఒక్కటే చివరికి మిగులుతుంది. అవి నేను కడప ప్రభుత్వ కళాశాలలో
పనిచేస్తున్న రోజులు. 1963 మే ప్రాంతం. వేసవి సెలవులు కావడం వల్ల
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి మాండలిక వృత్తి పదసేకర ణ ప్రాజెక్టు కింద
పనిచేయడం ప్రారంభించాం. అందులో భాగంగా క్షేత్రపర్యటనకు వెళ్లవలసి
వచ్చింది. కుమ్మరం, వడ్రంగం, స్వర్ణకార వృత్తికి సంబంధించిన పదసేకరణ పని
మీద నాలుగు రోజుల పాటు ఒక ఊళ్లో ఉన్నాం. నాలుగో రోజు ఆ పక్కనున్న ఊరు
వెళ్లాలి. నా వద్ద రెండు రూపాయలే ఉన్నాయి. స్టేషన్‌కు వెళుతుంటే,
ప్లాట్‌ఫామ్ మీద ఒక పుస్తకాల షాప్ కనిపించింది. దగ్గరగా
వెళ్లిచూస్తే అందులో గోర్కీ రాసిన నాటకాల పుస్తకం ఉంది. వెంటనే కొనేశా. ఆ
రాత్రి భోజనానికి అవసరమయ్యే ఆ రెండు రూపాయలు అలా అయిపోయాయి. మరి రాత్రి
భోజనం మాటేమిటి? ఇంకేముంది? కడుపునిండా నీళ్లు తాగి గాంధీ సత్రంలో
పడుకున్నా. ఈ అనుభవం మొదటిదేమీ కాదు. అలా ఎన్నో సార్లు జరిగింది.
వాస్తవానికి ఈ పుస్తక ప్రియత్వం చాలా సార్లే న న్ను ఇబ్బందులకు
గురిచేసింది. విద్యార్థి దశలోనూ, ఉద్యోగ దశలోనూ బాగా అప్పులు చేయడానికి అదే
కారణమయ్యింది. ఈ కారణంగానే నన్ను మా ఇంట్లో వాళ్లంతా వీడో అమాయకపు
చక్రవర్తి అనేవారు. బయటి వాళ్లేమో నన్ను ఓ పిచ్చిమాలోకం అన్నట్లు చూసేవారు.
కానీ ఆ పిచ్చే నన్ను ఈ నాటి ఈ దశకు చేర్చిందని నేననుకుంటాను.
తరువాతెప్పుడో తీసుకోవచ్చులే అనుకుని ఆ డబ్బులను భోజనానికి ఖర్చు చేయవచ్చు.
కానీ, డబ్బులు నీ చేతిలో ఉన్నప్పుడు ఆ పుస్తకాలు అందుబాటులో లేకపోవచ్చు.
ఏమైనా తాత్కాలిక బాధల్ని తట్టుకోలేని వారు, అద్భుతమైన ఆనందాల్ని
అందుకోలేరు అని నేను బలంగా అనుకుంటాను.
జీవితం మీదే విరక్తి కలిగితే....
నేను ఎస్‌వి యూనివర్సిటీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు రచయిత, చరిత్ర పరిశోధకుడు బంగోరె (బండి గోపాల్‌రెడ్డి) అక్కడే ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాడు. మా మధ్య ఏర్పడిన పరిచయం క్రమక్రమంగా ఎంతో ఆత్మీయంగా మారింది. ఆయన తరుచూ మా ఇంటికి వచ్చేవాడు. మొదట్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫీసర్‌గా చేసినా ఆ తరువాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, కొంత కాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ఉంటూ చరిత్ర పరిశోధనా వ్యాసాలు రాసేవాడు. ఆ తర్వాత ప్రాజెక్టు వర్క్స్ చేయడం మొదలెట్టాడు. మిత్రుడిగా ఎంత ఆత్మీయంగా ఉండేవాడో, ఒక పరిశోధకుడిగా అంత కర్కశంగా ఉండేవాడు. ఆ మాటల్లో ఒక మొక్కవోని ఆత్మ విశ్వాసం స్పష్టంగా కనిపించేది. ఎస్‌వి యూనివర్సిటీ ప్రాజెక్టు అయిపోగానే వాళ్ల ఊరికి వెళ్లిపోయాడు. నాకు ఆయన నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో " నాకు జీవితం మీద పూర్తిగా విరక్తి వచ్చేసింది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. చిత్తూరులో ఒక సంస్థవారు నన్ను రమ్మన్నారు. కానీ, అక్కడికి వెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు'' అంటూ రాశాడు.
అప్పటి నా పని ఒత్తిళ్ల కారణంగా ఆ ఉత్తరానికి బదులు రాయకుండా ఉండిపోయాను. ఆ ఉత్తరం వచ్చిన కొద్ది రోజులకే భాక్రానగర్ ప్రాజెక్టు చెంతన బంగోరె ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వార్త విన్న నేను రెండు ముక్కలుగా తెగిపడ్డానేమో అనిపించింది. ఊహ తెలిసిన తర్వాత ఏనాడూ కంటతడి పెట్టని నేను ఆ రోజు ఒక పసిపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ దుఃఖం వెనుక పర్వతంలా నిలిచిన ఒక పెద్ద పశ్చాత్తాపం కూడా ఉంది. ఉత్తరానికి నేను వెంటనే బదులు ఇచ్చి ఉంటే బంగోరె బతికుండే వాడేమో కదా! నేను ఎందుకు రాయలేకపోయాను అని చాలా బాధపడ్డాను. 'వెంటనే తిరుపతికి వచ్చేసెయ్. నాలుగు రోజులు మాతో గడుపు. ఏం చేయాలో ఆ తర్వాత ఆలోచిద్దాంలే'' అని నాలుగు ధైర్యం వచ్చే మాటలు రాసి ఉండొచ్చు కదా! ఒక అపరాధ భావన ఇప్పటికీ నన్ను తొలుస్తూనే ఉంది. ఒక సమస్యతో సంక్షుభితం కావడం వేరు. జీవితం మీదే విరక్తి రావడ ం వేరు. బంగోరె విషయంలో నేను చేసిన నిర్లక్ష్యం నాకు గొప్ప పాఠమే నేర్పింది. కారణం ఏదైనా కావచ్చు. సాటి మనిషి జీవితం పట్ల అనాసక్తిని వ్యక్తం చేస్తున్నప్పుడు తక్షణమే తగురీతిన స్పందించడం బంగోరె మరణం తర్వాత నేను నేర్చుకున్నాను.
మేధావి వర్గంలో కొంత మంది బాగా పర్ఫెక్షనిస్టులు. ప్రతిదీ 100 శాతం పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటారు. వాళ్లు. కానీ, ప్రపంచంలో ఏదీ నూటికి నూరు శాతం పర్‌ఫెక్ట్‌గా ఉండదు కదా! ఛాలెంజ్ చేసే తత్వంతో పాటు వీరిలో ఇంపర్‌ఫెక్షనిజాన్ని ఎంతమాత్రం భరించలేనితనం కూడా ఉంటుంది. వాస్తవానికి నన్ను కూడా చిన్నప్పటినుంచి ఒక రకమైన అశాంతి నిరంతరం వెంటాడుతూనే ఉంది. ఎక్కడా రాజీపడలేని లేదా చుట్టూ ఉండే పరిస్థితులతో ఇమడలేని ఒక సంఘర్షణ నాలో ఉంటూనే ఉంది. నిజానికి ఇదొక ప్రమాదకరమైన తత్వం. కాకపోతే ఎక్కడా నెగెటివ్ భావాలకు తావు లేకుండా ఉండడమే నాలోని ప్లస్‌పాయింట్ కావచ్చు. ఏమైనా, బంగోరె మరణం. మానవ జీవన పోరాటాల మీద, ఆత్మహత్యల మీద ఎన్నో కొత్త ఆలోచనలకు తెరతీసింది. కొత్త పాఠాలు నేర్పింది. కొన్ని కొత్త బాధ్యతలను పురమాయించింది. ఇది నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం.
స్మశానంలోనూ పూలుపూస్తాయి.
అప్పటిదాకా ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసిన నేను 1976లో ఎస్‌వియూనివర్సిటీలో లెక్చరర్‌గా ఎంపికయ్యాను. ఆ విషయం రిపోర్టు చేయడానికి ఆరోజు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మెట్లు ఎక్కుతున్నాను. అదే కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా పనిచే స్తున్న వడ్డెర చండీదాస్ మెట్లు దిగుతూ నాకు ఎదురయ్యారు. అదే యూనివర్సిటీలో నేను పిహెచ్‌డి చే సిన కారణంగా ఆయనతో నాకు ముందే పరిచయం ఉంది. రచ యితలుగా కూడా ఒకరికొకరం తెలుసు. మెట్లు ఎక్కిన నేను ఆయన కనిపించగానే ఆగాను. ఆయన నా కళ్లలోకి చూస్తూ సన్నగా నవ్వుతూనే "నువ్వు సృజనాత్మకతను సమాధిచేసే స్మశానానికి వచ్చావు'' అన్నారు.
నేను వెంటనే నవ్వేశాను కానీ, ఆ మాటలకు నా మనసులో ఏదో విస్ఫోటనం జరిగినట్లనిపించింది. ఒకరకంగా అదీ నిజమే. అకడమిక్ రంగంలోకి ప్రవేశించాక నిరంతరం విద్యార్థుల బోధన, పరిశోధనలకే పరిమితమైపోయి సృజనాత్మకతకు పెద్ద తావు ఉండదన్నదే ఆయన ఆలోచన కావ చ్చు. కాకపోతే, చండీదాస్ చివరిదాకా అకడమిక్‌గా ప్రొఫెసర్‌గానే ఉన్నా, ఆయన లోని సృజనాత్మకత మాత్రం అంతరించలేదు. యూనివ ర్సిటీలో అడుగుమోపిన తొలిరోజునే ఆయన చేసిన ఆ హెచ్చరిక నేను నేనుగా నిలబడటానికి, సాహిత్య రంగం నుంచి వైదొలగిపోకుండా కాపాడిందేమో అనిపిస్తుంది. మేధావుల మాటల్ని ఎంత తరచి చూస్తే అంత లోతైన సత్యాలు తెలుస్తాయని వడ్డెర చండీదాస్్‌ల వల్ల నాకు అనిపించింది.
అహంకారానికి విరుగుడు నేను హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో అంటే 1954లో మాకో టీచర్ ఉండేవారు. ఆయన అసలు పేరు తెలియదు గానీ, ఆయన అందరికీ తన పేరు ఫ్రాంక్లిన్-రామ్-మహమ్మద్ అని చెప్పేవారు. కుల, మత భావాలకు అతీతంగా ఉండాలన్న సంకల్పం ఆయన మాటల్లో ప్రతిధ్వనిస్తూ ఉండేది. మాకు ఆయన సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ చెప్పేవారు. ఆయన ఒక రోజు వివరంగా ఒక విషయాన్ని చెప్పి, చివరగా ఒక ప్రశ్న వేశారు. అన్నదేమిటీ అంటే "ఈ విశ్వం గురించి మీకు తెలుసు కదా! ఎన్నెన్ని నక్షత్రాలు? ఎన్నెన్ని గ్రహాలు? అసంఖ్యాకమైన ఆ గ్రహాల్లో మన భూగోళం ఒకటి కదా! ఈ భూగోళంలో ఎన్నో ఖండాలు ఉన్నాయి. ఒకానొక ఖండంలో మన దేశం ఉంది కదా. మళ్లీ దేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో జిల్లాలు, ఎన్నోగ్రామాలు ఉన్నాయి. ఎప్పుడైనా మీ గ్రామం వెళ్లి ఒక చోట కూర్చుని ఆకాశంలోకి అలా చూస్తూ ఆలోచించండి.
ఈ అనంత విశ్వంలో నువ్వెంత?''అంటూ ఒక్కొక్కరి కళ్లలోకి పరిశీలనగా చూశారు. నా మిగతా క్లాస్‌మేట్స్ మాట ఎలా ఉన్నా, నన్ను మాత్రం ఆ ప్రశ్న నిలువునా చీల్చివేసింది. అహంకారానికి ప్రపంచంలో అంతకన్నా పెద్ద విరుగుడు ఏముంటుంది? ఆ తరువాత రోజులు వారాలు కాదు, కొన్ని నెలల పర్యంతం నా ఆలోచనలు ఆ విషయం చుట్టే తిరుగుతూ ఉండేవి. ఈ రోజుకు కూడా ఎప్పుడైనా మనసులో ఏమూలనో కాస్తంత అహంకారం చోటుచేసుకుందామని చూస్తే వెంటనే ఆయన మాటలు చెంప చెళ్లుమనిపించినట్లు వినబడతాయి,జ్ఞానం మనిషిని ఆకాశాన్ని చేస్తుంది. అహంకారం ఆకాశాన్ని కూడా దుమ్మూ ధూళిలో కలిపేస్తుంది. నా జీవనయానాన్ని నిండుగా నడిపించే సత్యం కూడా ఇదేనేమో!
- బమ్మెర
ఫోటోలు: రాజ్‌కుమార్ (Andhra jyothy daily 10 May 2013)

Subscribe to:
Posts (Atom)