Wednesday, December 5, 2012

ఆధునికతలోంచి పల్లె మూలాలు

ముందుమాటలు, సమీక్షలు అవసరం లేని కథారచయిత కేతు విశ్వనాథరెడ్డి. కథారచయితగా ఆయనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. గత నాలుగున్నర థాబ్దాలుగా ఆయన కథలు రాస్తూనే వున్నారు. ఇంత సుదీర్ఘకాలం ఒక సృజనాత్మక ప్రక్రియను కొనసాగించడం అంత సులభం కాదు. అలా కొనసాగించడానికి కొన్నింటిని సాధన చేయవలసి వుంటుంది. ముఖ్యంగా గుండెతడి ఆరకుండా, రచయిత ఎప్పటికప్పుడు 'ఆత్మరక్షణ' చేసుకోవాల్సి వుంటుంది. మానవసంబంధాలు, భౌతికావసరాలు, వెంపర్లాటలు వ్యక్తిని రాయిని చేసి సమాజం గురించి, ఇరుగుపొరుగువారి గురించి ఆలోచించకుండా కట్టడి చేసే ప్రయత్నం జీవితంలో ప్రతిక్షణం జరుగుతూనే ఉంటుంది. అందుకే అంతరంగలోకాలను భద్రపరుచుకుంటూ, గుండెతడిని ఆరకుండా నిత్యం తనను తాను పొతం పెట్టుకునేవారే కథాప్రక్రియలో విశ్వనాథరెడ్డిలాగా కొనసాగగలుగుతారు. గతంలో మిగిలిపోకుండా వర్తమానంలో పచ్చని మనిషిగా సంచరిస్తున్న విశ్వనాథరెడ్డి 1998, 2003 మధ్య రాసిన కథల పుస్తకాన్ని పాఠకులకు అందించారు. 
ఈ పుస్తకంలో 12 కథలున్నాయి. రాయలసీమకు సంబంధించినంతవరకు నీళ్లకరువు, ముఠాకక్షలు ప్రధానసమస్యలు. కరువును పెనవేసుకునే ముఠాకక్షలు బలాన్ని పెంచుకుంటున్నాయి. ఈ రెండు అంశాలను ప్రధానం చేసుకుని రాయలసీమ జనజీవితదృశ్యాలను చిత్రించారు కేతు విశ్వనాథరెడ్డి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల నేపథ్యం రాయలసీమ జనజీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నదనే విషయాన్ని ఈ పుస్తకంలోని చాలా కథలు తెలియజేస్తాయి. విశ్వనాథరెడ్డికి పల్లెజీవితంపట్ల మొగ్గు ఎక్కువ. అంటే తన మూలాలను మర్చిపోని కథారచయిత ఈయన. దేన్ని విశ్లేషించినా పల్లెజీవితాలు బాగుపడాలనే దృష్టికోణాన్ని ఆయన వదులుకోలేదు. నగరజీవితాలకూ పల్లెజీవితాలకూ మధ్య, అమెరికాలోని ప్రవాసభారతీయుల జీవితాలకూ రాయలసీమ పల్లె జీవితాలకూ మధ్య పోలిక తెస్తూ పల్లెజీవితాలు ఇంత దుర్భరంగా ఎందుకు మారుతున్నాయనే రహస్యం గుట్టు విప్పారు రచయిత. అదే సమయంలో తన తరానికి, తన మనవలతరానికి మధ్య సంబంధిన్ని నెలకొల్పాలనే ఒక గాఢమైన తాపత్రయం కేతు విశ్వనాథరెడ్డి కథల్లో అంతర్లయగా సాగుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ సంబంధం మానవజీవితాన్ని, ముఖ్యంగా రాయలసీమ గ్రామీణ ప్రజల జీవితాలను బాగుపరిచేందుకు ఉపయోగపడే ఆలోచనల వైపు సాగేదిగా ఉండాలని రచయిత ఆశిస్తున్నట్లు మనం గమనించవచ్చు. పోలికలు, మాయపొరలు, రెండు ప్రపంచాలమధ్య, దగ్గరైన దూరం దూరమైన దగ్గర, పొడినిజం, విరూపం కథలను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ముఠాకక్షలకు పార్లమెంటరీ రాజకీయాలు ఎలా ఆజ్యం పోస్తున్నాయో, ప్రజలకు మేలు చేసేవారిపట్ల ఎలా కిరాతకంగా హతమారుస్తున్నాయో విశ్వనాథ రెడ్డి సమర్థంగా చిత్రించారు.


అధికార రాజకీయాలు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పని చేయడం లేదనే విషయాన్ని ఆయన కథల్లో అంతస్సూత్రంగా చెప్పుకుంటూపోయారు. 'పొడినిజం' కథ అందుకు మంచి ఉదాహరణ. గంగను కిందికి భగీరథుడిలా నేల మీదికి దించితే తాత చెప్పిన 'పాడు కాలం' నశించి మంచి కాలం వస్తుందనే ఆలోచన గంగాధరకు అర్థమవుతుంది. ఆ గంగను ఎవరు దించాలంటే తాను విన్న కథల్లో లాగా రాజులు ఆ మంచిపనులు చేయాలని గంగాధర అనుకుకంటాడు. అలాంటి భగీరథుడు ఉంటాడనే నమ్మకం నుంచి, ఇప్పుడు అలాంటి రాజులు లేరు, కదా ఎవరు సమస్యను పరిష్కరించాలనే విచికిత్సలో పడతాడు ఆ బాలుడు. ఇప్పుడున్నది మంత్రులు కదా అంటూ వారు ఆ పని చేయరనే విషయాన్ని గంగాధర ఆలోచనల్లోనే రచయిత ధ్వన్యాత్మకంగా చెప్తారు. అలా చెపుతూ తమ కష్టాలను తీర్చుకోవడానికి మంచి పని చేయాలనే ఆలోచన గంగాధరకు వచ్చినట్లు రచయిత కథను ముగిస్తారు. ఇందులో భవిష్యత్తరాల పట్ల రచయిత ఒక ఆశావహదృక్పథాన్ని పెంపొందించుకోవడం మనం చూస్తాం. ఇటువంటి ఆశావహ దృక్పథమే ఈ పుస్తకంలోని అన్ని కథల్లో చూస్తాం. 


పిల్లల మనస్తత్వాన్ని, పిల్లల ఆలోచనా స్థాయిని కేతు విశ్వనాథరెడ్డి బలంగా పట్టుకున్నారు. వారి చేత పెద్ద పెద్ద మాటలు మాట్లాడించకుండానే చాలా పెద్ద విషయాలను ఆయన సునాయసంగా చెప్పగలిగారు. ఈ విషయంలో కథకుడిగా, కథా నిర్మాణ వ్యూహం తెలిసినవాడిగా ఆయన సత్తా ఏమిటో చాటుకున్నారు. పొడినిజం కథతో పాటు పోలికలు, దగ్గరైన దూరం దూరమైన దగ్గర కథలు ఇందుకు అద్దం పడుతున్నాయి. పోలికలు కథలో తాతామనవళ్లకు మధ్య ఉండే సహజసిద్ధమైన అనుబంధాన్ని రాయలసీమ రైతుల జీవితాలు పొడివారిపోతున్న విషయాన్ని సహజసిద్ధంగా ఆవిష్కరించడానికి రచయిత వాడుకున్నారు. నగరజీవితాన్ని తన ఊరి జీవితంతో పోల్చి చూసే శంకరయ్య తాత ఆలోచనలను, మాటలను మనవడి దృక్కోణం నుంచి విశ్లేషించుకుంటూ పోతారు రచయిత. ఆ మనవడు మీసాలు తిరిగిన యువకుడేం కాదు, చిట్టిపొట్టి చేతుల చిన్నారి. ఈ ఇద్దరూ తాము చూస్తున్న, వింటున్న విషయాలను తమ తమ జీవితపరిధిలోంచి, తమకు తెలిసిన, అనుభవం ఉన్న జీవితంలోంచి విశ్లేషించుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. వారు అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో పాఠకులకు కథ అంతస్సారం ఒంటబట్టి రాయలసీమ పల్లెజీవితాలు రూపుకట్టి దిగులు మేఘాలు ఆవరించి, గుండె గొంతులోన కొట్లాడటం మొదలు పెడుతుంది. సాహిత్యానికి ఇంతకాన్న కావాల్సిన ప్రయోజనం ఏమిటి? 


దగ్గరైన దూరం దూరమైన దగ్గర కథలో అమెరికాలో పుట్టిన రాయలసీమ పాప తన సొంత వూరికి వచ్చి ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, అమెరికాలోని పరిస్థితులకూ ఇక్కడి పరిస్థితులకూ మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడానికి పడే తపన రచయిత చిత్రించారు. ఆఖరుకు ఆ పాప పడే సంఘర్షణ నుంచి, తన సంఘర్షణ నుంచి ఒక పరిష్కారాన్ని కనుక్కునే ప్రయత్నంలో ఒక నిర్ధారణకు రాకపోవడాన్ని ఆ పాప మాటల్లోనే చెబుతూ రచయిత కథ ముగిస్తాడు. ''ఇక్కడ బాగుంది, అమెరికాలో మాదిరి అన్నీ లేవు, ఎందుకు?'' అని ఆ పాప ప్రశ్నించుకుంటుంది. ఈ పాప వేసుకున్న ప్రశ్నకు మాటల్లో సమాధానం చెప్పడం సాధ్యం కాదు. అది మాటలకు అందని అనుభూతిని మాత్రమే మిగిలిస్తుంది. ఇలా పాఠకులు అనుభవించి, పలవరించడానికి రచయిత అన్ని కథల్లోనూ అవకాశం కల్పించారు. పాఠకుల పట్ల గౌరవభావం, పాఠకులస్ఠాయిపై నమ్మకం కలిగిన రచయితకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. విడమర్చి చెప్పాల్సిన విషయాలను, రచయిత తాను చెప్పదలుచుకున్న విషయాలను పాఠకుడి ఆలోచనకే వదిలేయడం ద్వారా కథారచయితగా విశ్వనాథ రెడ్డి గొప్ప ఫలితం సాధించారు. 


ఒక వాల్మీకి, ముఖదర్శనం, కాంక్ష, అమ్మవారి నవ్వు, సంకటవిమోచిని కథలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటిలో అమ్మవారి నవ్వు బాగా కుదిరిన కథ. ఒక చక్కటి కావ్యంలా ఈ కథ సాగుతుంది. ప్రపంచంలో, ముఖ్యంగా దేశంలో నెలకొన్న పరిస్థితులకు కారణం ఎక్కడుందో, పరిష్కారం ఏమిటో సూచించిన కథ ఇది. హిందూముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాల గుట్టును పాతర వేసిన కథ. జాఫర్‌ పూలతో రూపుదిద్దిన మూర్తులను చూసి ''.... ఒక గొప్ప హిందూ సంస్కారం ఈ మూర్తుల్లో కనిపిస్తోంది. అమ్మవారి పెదాల మధ్య విరిసీవిరియని ఆ నవ్వును చూపడం సాధకులైన మన హిందూ కళాకారులకే సాధ్యం'' అని అంటూ ''అ పుష్ప ప్రతిమలను ఎవరు రూపొందించారు?'' అని అడిగిన సుందర రామానందులుకు హరీశ్వర్‌ ''మా జాఫర్‌ చిన్నాయన'' అని ఇచ్చిన సమాధానం ఒక చెంపపెట్టులాంటిది. రామానందులు ఏ రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడో విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. సంకటవిమోచిన సామాజిక వాస్తవాలను కళాత్మకంగా చెప్పిన కథ. ఇందులోని చౌడేశ్వరి పాత్ర రిజర్వేషన్ల కారణంగా అగ్రకులాలవారు దిగువకులాలపై పెంచుకునే ద్వేషానికి సమర్థంగా సమాధానం చెపుతుంది. చౌడేశ్వరి పాత్రను రచయిత చాలా ఉదాత్తంగా చిత్రించి మంచి ప్రయోజనం సాధించారు. 'వాల్మీకి' కథ ఒక పురాగాథ వంటిది. ఇటువంటి కథల ద్వారా మన వారసత్వ జాడలు తెలుసుకుని మానవజీవితంపట్ల మమకారాన్ని పెంచుకోవడానికి తోడ్పడతాయి. ముఖదర్శనం, కాంక్ష కథలు సామాజికరుగ్మతలకు చికిత్స చేసే కథలు. 


విశ్వనాథ రెడ్డి సమాజంలో సాంకేతిక, సమాచార విప్లవం తెచ్చిన మార్పుల నేపథ్యంలోంచి పల్లెజీవితాలు మరింత దిగజారుతున్న వైనాన్ని తన కథల్లో రూపుకట్టారు. తద్వారా జరగాల్సిన నిజమైన అభివృద్ధికి, పాలకులు చెప్పే బూటకపు అభివృద్ధికి మధ్య గల తేడా గుట్టు విప్పారు. ఈ కథలు చదివితే ఏ పాత్ర మీద కూడ మనకు విద్వేషం కలగదు, పైగా మానవులందరిపట్ల ప్రేమ పుడుతుంది. మనం ఎవరి వెంట ఉండాలో, ఎవరిని సమర్థించాలో, ఏ వర్గాన్ని వదిలేయాలో తెలియజేసే కథలు ఇవి. ఆర్థిక అసమానతలు, సామాజిక అంతరాలు ఎలా సమాజంలో హెచ్చుతగ్గులకు కారణమవుతాయో ఈ కథలు తెలియజేస్తాయి. 


రచనా విధానంలో కొడవటిగంటి కుటుంబరావు సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న కేతు విశ్వనాథ రెడ్డి కథల్లో అనవసర వాక్యాలు, పదాలు వుండవు. సమాజ పరిస్థితులను, కార్యకారణ సంబంధాలను దారంలో పోగులాగా అల్లుకుపోతూ సృజనాత్మక సాహిత్యం నిర్వర్తించాల్సిన ప్రయోజనాన్ని ఈయన కథలు నెరవేరుస్తాయి. కుటుంబరావు మధ్యతరగతి సమాజాన్ని విశ్లేషించడానికి పూనుకుంటే విశ్వనాథ రెడ్డి పల్లెజీవితాలను విశ్లేషించే పనికి పూనుకున్నారు. ఇప్పుడిప్పుడే మధ్యతరగతిగా, నయాసంపన్నవర్గంగా ఎదుగుతన్న సమూహాలను కూడా విశ్వనాథ రెడ్డి చిత్రీకరించారు. అయితే ఇదంతా పల్లె దృక్కోణం నుంచి సాగుతుంది.


విశ్వనాథరెడ్డి ఇంకా కథలు రాస్తూనే ఉండాలని అనిపించడం ఈ కథలు చదువుతుంటే కలిగే భావన. అది సాహిత్యకారుతలకు ఆయన అందించిన అంశం.
- కాసుల ప్రతాపరెడ్డి

Wednesday, August 8, 2012

పిల్లల పెంపకం లో రూల్సూ, రూళ్ళ కర్రలూ లేవు !

టీచర్లంటే రూల్సూ రూళ్లకర్రలూ అదిలింపులూ బెదిరింపులూ గుర్తొస్తాయి. ప్రొఫెసర్‌గా, సాహిత్యకారుడిగా సుప్రసిద్ధులైన కేతు విశ్వనాథరెడ్డి కాని, ఆయన శ్రీమతి పద్మావతిగాని రూల్సు జోలికి పోలేదు. రూళ్లకర్రల జోలికీ పోలేదు. పిల్లల సమక్షంలో ఉన్నారు. కాని పెత్తనం చేయకుండా పర్యవేక్షణకే ప్రాధాన్యం ఇచ్చారు. విలువలు కొన్ని నేర్పాలి, కొన్ని అలవాటు చేయాలి. ఆ విషయంలో మాత్రం వాళ్లు రాజీ పడలేదు. ఇది వాళ్ల పెంపకం. తెలుసుకోదగ్గ పాఠం. 

ల్లిదండ్రులు పిల్లలకు ఆలంబనగా నిలవాల్సిన సందర్భాలు ఉంటాయి, వాళ్లకు సమస్యలు వస్తే తమకు తాముగా పరిష్కరించుకోమని దూరంగా నిలబడి పర్యవేక్షించాల్సిన సందర్భాలూ ఉంటాయి. ఎక్కడ ఆలంబన అవ్వాలి, ఎక్కడ వికసించనివ్వాలి అన్నది నిర్ణయించుకోవడమే తల్లిదండ్రుల విజ్ఞత అంటారు కేతు విశ్వనాథరెడ్డి, పద్మావతి దంపతులు. మేము పిల్లల్ని అలా పెంచాం అనడం కంటే మా పెంపకంలో వాళ్లు ఇలా పెరిగారనడమే సబబేమో అంటూ తమ అనుభవాలను పంచుకున్నారు. ముందుగా విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ ‘‘నేను ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ పెంచలేదు. వాల్యూ సిస్టమ్‌కి ప్రాధాన్యం ఇచ్చాను. ఇంటి వాతావరణమూ అంతే. మా ఇంటికి వచ్చే మిత్రులు కూడా అలాంటివారే. 

ఏ గూటి చిలుక ఆ పలుకే పలుకుతుందన్నట్లుగా పెరిగారు మా పిల్లలు. ఒక సంఘటన చెబుతాను... అప్పుడు మా అబ్బాయి టెన్త్ క్లాస్. పరిగెడుతూ పడి తలకు దెబ్బ తలిగించుకున్నాడు. డాక్టర్ తలకు కట్టు కట్టి, మందులు రాసిచ్చి మళ్లీ చెకప్‌కు వచ్చే వరకు కట్టు విప్పవద్దన్నారు. ఈ లోపు పరీక్షలు మొదలయ్యాయి. కట్టు తీసేసి పరీక్షకు కూర్చోవలసిందేనని ఎగ్జామినర్ అభ్యంతరం చెప్పారు. కట్టు ముసుగులో కాపీ కొడతారని వాళ్ల సందేహం. నేను యూనివర్శిటీలో ప్రొఫెసర్‌ననీ మా అబ్బాయి మీరనుకునే తప్పు చేయడనీ చెప్పి ఒకవేళ అలా జరిగితే మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి అని పరీక్ష రాయించాను. 

అలా వాడి మీద నాకెంత నమ్మకం ఉందో ఇన్‌డెరైక్ట్‌గా చెప్పాను. మనం పిల్లల్ని నమ్మితే పిల్లలు మనల్ని నమ్ముతారు. మేము హైదరాబాద్‌లో ఉండి పిల్లలను వాళ్లకు ఇష్టమైన కోర్సుల్లో సీటు వచ్చిన చోట హాస్టల్‌లో ఉంచి చదివించాం. శశికాంత్‌కి ఒకసారి హాజరు తగ్గింది. అదే విషయాన్ని ప్రిన్సిపాల్ ఫోన్ చేసి చెప్పారు. ఆ ప్రిన్సిపాల్ నాక్కూడా టీచరే. నేను చెబితే పరీక్షకు కూర్చోనిస్తారు లేదంటే డీటెయిన్ చేయాల్సి ఉంటుందన్నారు. డీటెయిన్ చేయమనే చెప్పాను, ఎందుకంటే పిల్లలకు బాధ్యత తెలియాలి. తన ప్రమేయం లేకుండా దెబ్బతగిలి పరీక్షకు హాజరుకాలేని పరిస్థితికీ, క్లాసులకు హాజరు కాకుండా పరీక్షకు కూర్చోలేని పరిస్థితికీ చాలా తేడా ఉంది. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల తప్పును వెనకేసుకురాకూడదు. తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండాల్సింది ప్రేమే కానీ మమకారం కాదు’’ అన్నారాయన.

మాకు ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. ఎవరూ చదువును నిర్లక్ష్యం చేయలేదు. పెద్దమ్మాయి మాధవీలత గోవాలో లెక్చరర్. అబ్బాయి శశికాంత్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. చిన్నమ్మాయి శిరీష ఎంసిఎ చదివి డల్లాస్‌లో ఉంటోంది.


నా మీద ఆరోపణలు!

పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛనిస్తున్నారని భార్య నుంచి, ప్రేమను పంచలేదని పిల్లల నుంచి ఆక్షేపణలు, ఆరోపణలను ఎదుర్కొన్నానని చాలా మురిపెంగా చెప్తూ నా పిల్లలకు నా మీద ఆరోపణ చేయగలిగినంత స్వాతంత్య్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చానంటారీ ప్రొఫెసర్. ‘‘నేను సాధారణమైన జీవితాన్ని కోరుకుంటాను, కాబట్టి పిల్లలకూ అదే చెబుతుంటాను. సాహిత్య చర్చలకు ఆహ్వానించినప్పుడు స్టార్ హోటళ్లలో బస ఇస్తారు. 



ఆ సౌకర్యాల వ్యామోహంలో పడకూడదు. నాకు స్టార్‌హోటల్ గదిలో ఎలా నిద్రపడుతుందో, నేల మీద చాప వేసినా అలాగే నిద్రపడుతుంది. మా ఊరు వెళితే వేపచెట్టు నీడన కూర్చుంటాను. మనం ఏ స్థాయికి వెళ్లినా మన మూలాలను మర్చిపోకూడదు. చాలా ఏళ్ల కిందట కందుకూరులో గవర్నమెంట్ కాలేజ్‌లో ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడూ అందరం కందుకూరు నుంచి కావలి వెళ్లి వస్తుండేవాళ్లం. ఒకసారి దారిలో జొన్నకంకులను చూసి పెద్దమ్మాయి ‘నాన్నా! అవి ఏం చెట్లు’ అని అడిగింది. అప్పుడే చెప్పాను పిల్లలందరికీ ఏడాదికి కనీసం నెల రోజులైనా పల్లెలో గడపాలని. అప్పట్నించి ఏటా మా ఊరు రంగశాయిపురం వెళ్తున్నాం. కడపజిల్లా ఎర్రగుంట్ల దగ్గర ఉంటుందీ ఊరు’’ అన్నారు సొంతూరి మీద మమకారంతో.



ఒకేరకంగా పెంచాం! చదివించాం!!

కూతుళ్లను, కొడుకుని పెంచిన తల్లిగా పద్మావతి అనుసరించిన పద్ధతి గురించి అడిగినప్పుడు... ‘‘అమ్మాయి, అబ్బాయి అనే తేడా ఎప్పుడూ చూపించలేదు. మంచిచెడులు తెలియచెప్పాల్సిన తీరు అమ్మాయికి అబ్బాయికీ మారదు. మేము కులమతాల గురించి చెప్పలేదు అంటూ ఒక సంఘటనను ఉదహరించారామె. ‘‘మా పెద్దమ్మాయి ఆరవ తరగతిలో ఉన్నప్పుడు మీరేంటోళ్లు అని అడిగారట టీచరు. ఆ ప్రశ్న మా అమ్మాయికి అర్థం కాలేదు. అలాగే ఒకసారి అప్పుడు శశికాంత్ ఏడేళ్ల వాడు. ఇంటికి వచ్చి ఒక పిల్లాడు వాళ్ల అక్కని రాయితో కొట్టాడని చెప్తూ ఆ పిల్లాడి మతాన్ని ప్రస్తావించాడు. వెంటనే మా వారు దెబ్బ గురించి కాకుండా ఆ పిల్లవాడు ఫలానా మతస్తుడని నీకెవరు చెప్పారని అడిగారు. 



స్వతహాగా వికసించనివ్వాలి!

‘‘పిల్లల్లో ఎవరికి వాళ్లకు తమకంటూ ప్రత్యేకమైన మానసిక వికాస తీరు ఉంటుంది. ఏ విషయంలోనూ మరొకరితో పోల్చకూడదు. ప్రతి మనిషీ ప్రత్యేకమైనవాడే. కొడవటిగంటి కుటుంబరావు... సమష్టి కుటుంబ అంశాలు, జన్యుపరమైన, సామాజిక పరమైన అంశాల ప్రభావంతో ఒక వ్యక్తి తయారవుతాడన్నారు. అలాగే గురజాడగారు ‘ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును’ అన్నాడు. మంచివాడిగా మారాలంటే చేయాల్సిన పని ఇదీ అంటూ ఏదీ లేదు, సజ్జనసాంగత్యం మంచి లక్షణాలు నేర్పుతుందని సూక్తి. పిల్లలకు అదే నేర్పించాం. 

- కేతు విశ్వనాథరెడ్డి



‘మా స్కూల్లో చెప్పారు, ఇలాంటి పనులు వాళ్లే చేస్తారని’ అనడంతో మరుసటిరోజు పిల్లలిద్దరినీ వేరే స్కూల్లో చేర్చారు. ఇలాగే మా వారికి కొన్ని నియమాలు ఉన్నాయి. పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయలేదు, పుట్టిన రోజు వేడుకలు చేయలేదు. దేనికీ తాపత్రయపడకూడదనే తత్వం ఆయనది. అదే మా పిల్లలకూ అలవడింది. మా అల్లుళ్లు మా అమ్మాయిలతో ‘మీ అమ్మానాన్నలకు నూటికి నూరు మార్కులు వేయాలి, పిల్లల్ని అలా పెంచడం మీకు రావట్లేదు’ అంటుంటారు’’ అన్నారామె ఒకింత సంతోషంగా. ఆ మాట చెప్తున్నప్పుడు ఆమెలో కనిపించిన సంతోషానికి ఆయన ఆనందించారు - ఆ కాంప్లిమెంట్‌ని అంగీకరిస్తున్నట్టుగా.



- వాకా మంజుల, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

Friday, April 13, 2012

నేను నల్ల రేగడి మనిషిని ..!జొన్నన్నం జొన్న రొట్టెలు తినే మనిషిని..!

  • కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు పొందిన సందర్భంగా.. ప్రముఖ కథా రచయిత  ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి తో ఇంటర్వ్యూ  
  • నిన్న కా.రా. మాష్టారు, నేడు మీరు కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు పొందటం ఆధునిక తెలుగు సాహిత్యానికి అనువైన  వాతావరణం ఏర్పడుతోంది అనటానికి సూచనగా వుందని భావిస్తున్నారు. మీరేమంటారు?

  • "మీరన్నది అక్షరాల నిజం. ఆధునిక తెలుగు కథ  ఎక్కడో ఏ ఒక్కరితోనో ఆగిపోలేదని సాహిత్యమిత్రులు ఈ సందర్భంగా పునరాలోచించుకుంటే నేను చాలా సంతోషిస్తాను. ఈ పునరాలోచనలో జీవితం నుంచి బయలుదేరాలా? కథా సాహిత్యం నుంచి బయలుదేరాలా?మనలను అప్పుడప్పుడు కట్టివేసే తాతాచార్యుల ముద్రల చెర నుంచి విముక్తం కావాలా అనే విషయాలను సావధానంగా ఆలోచిస్తే -తెలుగు కథా రచయితలు తెలుగు ఆధునిక సాహిత్యాన్ని జీవితం నుంచే స్పష్టించుకుంటూ పోతారనే నా ఆశ " .

  • తెలుగు కధా సాహిత్యాన్ని ఇతర భారతీయ భషల్లో వచ్చిన కధా సాహిత్యాన్ని పరిశీలించి పోల్చిచూసినప్పుడు మీకేమనిపిస్తుంది?

  • కొన్ని సామ్యాలు, ఆంతరాలూ వున్నాయనిపిస్తుంది.వివిధ భారతీయ భాషల్లోని కధాసాహిత్యంతో నాకున్న స్వల్ప పరిచాయాన్ని అదీ అనువాదాల ద్వారా దృష్టిలో  వుంచుకొని అభిప్రాయం చెప్పమంటే - ఇటీవల మానసిక సంఘర్షణకు   ఆధ్యాత్మిక సంవేదనకు ప్రాధాన్యం ఇవ్వడం కొందరి రచయితల విషయంలో జరుగుతోంది . తెలుగులో బలమైన సామాజిక ఉద్యమాల ప్రేరణ ఉండటం వల్ల భౌతిక జీవిత ఘర్షణకు  ప్రాధాన్యం ఎక్కువ కనిపిస్తుంది. అట్లాగని  భౌతిక జీవిత ఘర్షణలో మానసిక సంవేదనని  తెలుగు కధా రచయితలు పట్టించుకోలేదని అర్ధంకాదు. మరో అంతరం కనిపిస్తుంది. అది రూప ప్రయోగానికి సంబంధించింది.తెలుగు కధా సాహిత్యంలో రూపప్రయోగాలున్నాయి. అయితే మిగతా భాషలతో పోల్చినప్పుడు అవి తక్కువగా వున్నాయి .అనేవారికి నాదొక్కటే మనవి. మనకు కలకత్తా  లేదు,ముంబాయి లేదు, మద్రాసు, బెంగుళూరు కూడా లేవు. అమృత్సర్ లేదు అహమ్మదాబాదు కూడా లేదు. వాటి దారిలో హైదరాబాదో ,విశాఖో, విజయవాడో, అనంతపురమో, తిరుపతో, కడపో నగరీకరణ చెందితే రూప ప్రయోగాలు వాటంతటవే వస్తాయి. అయితే తెలుగు జీవితంలోని వాస్తవికతను గుర్తించిన వారసత్వం కేవలం తెలుగు కథకుడ్ని ప్రయోగవాదుడుగా నిలపదని నా విశ్వాసం ".

  • మానసిక చిత్రణ, వాతావరణ చిత్రణ కథా వస్తువుగా స్వీకరించి అద్భుతమైన కథలు రాసినవారున్నారు. అంతరంగిక జీఎవిత చిత్రణ ప్రధానంగా మీరు కథలు రాశారా?  
  •     “ మీరు మార్క్స్ కూ  ప్రాయిడ్ కూ ఏదో తగాదా పెట్టినట్టుంది. అయితే అదేదో తగాదా అని నేను భావించడం లేదు. నవ్య ప్రాయిడ్ వాదులను కూడా అంతో ఇంతో దృష్టిలో పెట్టుకునే ఈ మాట అంటున్నాను. మానసిక జీవితానికీ భౌతిక జీవితానికీ ఉండే సంబంధం - ఎక్కడా ఎప్పుడు ఎందుకు ప్రారంభమవుతుందనే ఆలోచన నిజంగా రచయిత చేస్తే దేనికెంత ప్రాధాన్యతనివ్వాలో రచయిత నిర్ణయించుకుంటాడు. వాతావరణం విషయం కూడా ఇట్లాంటిదే . పెద్దిభొట్ల సుబ్బరామయ్య నో, ' చాసో " నో  అడపా దడపా సొదుం జయరామో ,రాచమల్లు రామచంద్రా రెడ్డి నో ఇంకా అల్లం రాజయ్య ,తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, పి.సత్యవతి, ఓల్గా వంటివాళ్ల కథల్ని కాస్త నిశితంగా పరిశీలించండి. కేవలం మానసిక జీవితం, కేవలం భౌతిక జీవితం విడివిడిగా వుంటాయనే వాదనకు ఏ రచయితైనా దిగితే వాదించడం అనవసరం.  ఇవి రెండూ పరస్పర ఆశ్రితాలు, ఆధేయాలు, ప్రభావకాలు, పూరకాలు.   ఈ విషయాన్ని  మార్క్సిస్టులు నిరాకరించడం లేదు. మన సమాజంలో యజ్ఞానికి ఎంత ప్రాధాన్యత ఉందో "సంకల్పా" నికీ అంతే ప్రాధాన్యం ఉంది.   

  • అయితే బుచ్చిబాబు, పద్మరాజు, త్రిపుర, వడ్డెర చండీదాస్  వంటి కథకులకు సముచిత స్థానాన్ని మీరంగీకరిస్తున్నట్లే కదా !   ?

  • పూర్తిగా అంగీకరించడం లేదు .వాళ్ళ మానసిక విశ్లేషణ బొత్తిగా భౌతిక జీవితం తో సంబంధం లేనిదంటే  నేను నమ్మలేను . వాళ్ళు సృష్టించిన పాత్రల సామాజిక వర్గం, ఆర్థికవర్గం నాకు గుర్తుకు వస్తాయి. అది ఆ వర్గాలకు సహజం అనుకుంటే ఎవరికీ ఏపేచీ ఉండదు. ఒక అన్వేషణ ఉన్న రచయితలుగా వారిని నేను అభిమానిస్తాను. గౌరవిస్తాను. కథల్లోనో, వ్యాసాల్లోనో భౌతికంతో ఏ ప్రమేయం లేదని ఎక్కడైనా అన్న సందర్భాలుంటే - గుర్తున్నంతవరకు వాళ్ళ కల్పనా సాహిత్యంలో బలమైన తాత్విక ప్రతిపాదనగా ఉన్నాయనుకోను. నేను అంగీకరించలేను. ఒక వేళ ఉన్నా వాళ్ళ సాహిత్యాన్ని భౌతికవాదులైన రచయితలందరూ తప్పక చదవాలి. - చంచల స్వభావాలు అర్థం చేసుకోవడానికి ."      

  • అయితే సృజనక్రమంలో మీ దృష్టిలో వాస్తవికవాదానికి ఉన్న స్థానం ఎలాంటిది ? జీవిత సత్యాల్ని ఆవిష్కరించే క్రమంలో మీరే వాదాన్ని సమర్థిస్తారు ?    

  • " వాస్తవికతా వాదమంటే కేవలం యాంత్రిక, భౌతిక వాదం కాదు. అది భౌతిక , మానసిక శక్తుల ఘర్షణల ఆవిష్కరణ - మనిషి మరింత సుఖంగా సంస్కారవంతంగా, నాగరికంగా బతకడానికి చేసే నిరంతర ప్రయత్నం. దీని నిర్వచనం చర్చించడం కంటే ఒక సారి మళ్ళీ కుటుంబ రావు సాహిత్యాన్ని తాపీగా చదవడం మన ఆరోగ్యానికి మంచిదనుకుంటాను. అట్లాగే రా.రా విమర్శను కూడా . నేను మౌలికంగా వాస్తవికతావాదినే. ఏమేరకు ఆవాదాన్ని నా రచనల్లో ప్రతిఫలింప చేశాననేది తెలుపవలసింది నేను కాదు. పాఠకులూ, విమర్శకులూ, సాహిత్యకారులూ - నా రాసిని బట్టి కాదు. నేను స్లో రైటర్ ని. దిద్దీ దిద్దీ తాపత్రయపడేవాణ్ణి . దాన్ని గమనించవచ్చు. "    

  • ఇవాళ వస్తున్న అనేక సాహిత్య వాదాలు, రావాలన్న బాలవాదాలతో సహా - వస్తుపరంగా సిద్ధాంతపరంగా ఈ వాదాల మార్గదర్శకత్వం లోనే సాహిత్యం నడవాల్సిన అవసరం ఉందా

  • " లేదు. ఏవాదాలైనా ముందు పుట్టవు. వాదాలు జీవితాన్ని దాటిపోతే వాటి బతుకు గల్లంతవుతుంది. కానీ సమాజంలోని జీవితవాస్తవాల్ని గ్రహించకపోతే వాదాలకు ఒక తాత్వికత సమకూరదు. స్త్రీవాదం ,దళితవాదం, బాలవాదం, ఆఖరికి రాబోయే వృద్ధవాదం లాంటి వాదాలు కూడా సమాజంలో ఉత్తమమైన తక్షణ, దీర్ఘకాల సమస్యల నుంచి పుట్టినవి. అవి నాదృష్టిలో ఉపవాదాలే కానీ సమగ్ర పోరాటవాదాలు మాత్రం కావు. అయితే ప్రాంతీయ అసమానతల్ని నిర్లక్ష్యం చేసినట్లే వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇవి భస్మాసుర హస్తాలవుతాయి. భస్మాసురుడిని ఏమోహినో వశపరచుకునేదాకా మోహినులు శాశ్వతంగా ఉంటారనుకోవడం మాత్రం భ్రమ, మన అవతారాలేవో ఉన్నట్లు". 

  • ప్రాంతీయ జీవితాన్ని ప్రతిబింబించే కథలు విరివిగా రావాలని కొందరి ఆకాంక్ష. ప్రాంతీయ జీవితం, ప్రాంతీయ మాండలికం ప్రాంతీయ రచయితలు - ఇలా వీటికి ప్రాధాన్యతనిస్తూ పోతే ఇవి ఎక్కడికి దారితీస్తాయి?

  • " ప్రాంతీయ వాస్తవికవాద స్ఫృహ ఉన్న సాహిత్యం వేరు, కేవలం ప్రాంతీయ స్వలాభాపేక్ష ఉన్న రాజకీయం వేరు. ఉప సంస్కృతులు ఉప సమస్యలు ఉన్నంతకాలం అవి తప్పనిసరిగా సాహిత్యంలో ప్రతిఫలిస్తాయి. వాటిని తేల్చుకోవల్సింది సాహిత్యకారులు కాదు. రాజకీయ మనుషులు . అది తెలంగాణా అయినా సరే రాయలసీమ అయినా సరే. " 

  • భౌగోళిక పరిస్తులు జీవితాన్ని ఎలా నియంత్రిస్తాయో తెలుసుకోవాలనే వారిని రాయలసీమ కథలని చదవమంటారు. ఆ కథ్qఅలన్నీ కరువు కథలే అని ప్రతీతి ఉంది. మరి ఇతర జీవిత పార్శ్వాలను తడిమిన రచయితలు అక్కడ లేరంటారా

  • అవును . భౌగోళిక పరిస్థితులు జీవితాన్ని అనుశాసించ్వ్హటం ఒక ప్రమేయం . మార్కెటింగ్ రీత్యా తప్ప రొయ్యల పెంపకం తెలియని రాయలసీమ మెట్ట వాసుల్ని అనుశాసిస్తున్నది సముద్రమా, నదులా, కొండలా గుట్టలా, నీళ్ళా - ఆలోచిస్తే  దాన్ని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించవచ్చు. ఈ పరిస్తితులతో ముడిపడిన అభివృద్ధి తలాతోకల్ని కూడా పరిశీలిస్తే - కన్యాశుల్కంలో  సారా దుకాణంలో బైరాగి చెప్పినట్లు తత్వం బోధపడుతుంది.

  • ఇటీవల కథాసంపుటాలు విరివిగా ప్రచురిస్తున్నారు. నవలతోపాటు కథానికకు కూడా మార్కెట్ వాల్యూ ఎక్కువ లభించిందంటారా?

  •  " ఇది ఒక రకంగా అభినందనీయమే. పాఠకుల తీరిక, అభిరుచి, ప్రసార ప్రచార వ్యవస్థ , భిన్నకాలవ్యవధుల్లో అందించే కార్యక్రమాలు, ఏకాగ్ర అనుభూతిని తక్కువ సమయంలో అందించగలిగిన దృశ్యమాధ్యమంలోని కథలూ - వీటన్నింటినీ సమన్వయపరచుకొంటే కథకుండబోయే భవిష్యత్తు అద్భుతం , అనూహ్యం. పది సెకన్లకాలంలో ఒక దృశ్యాన్ని మనస్సుకు హత్తుకునేట్లు చేయగలిగిన సాంకేతిక మాధ్యమం ఉన్నప్పుడు ఆ ప్రమాణాలు ప్రేక్షకుల మీద, పాఠకుల మీద, శ్రోతల మీదపడి తీరతాయి. "        

  • 1934 నుంచి ఒక గొప్ప సాహిత్య ఉద్యమాన్ని నడుపుతున్న సంస్థకు అధ్యక్షునిగా మీ ముందు పెద్ద బాధ్యత ఉంది. కర్తవ్యముంది. దానినెలా నిర్వర్తించాలనుకుంటున్నారు

  • " అరసం విషయమా? తాతాజి, శ్రీశ్రీ, కుటుంబరావు, కె.వి.రమణారెడ్డి, తుమ్మల, ఏటుకూరి మొదలైన హేమాహేమీలకు  సాధ్యం కానిదేదో సాధిస్తాననే అపోహలు నాకు లేవు. నీ సహచరులైన కార్యవాదులు చేసే సమన్వయాన్ని బట్టి జ్ఞాతులైన వైరిపక్షాలుగా గిరిగీసుకున్న వారి వ్యూహాలను బట్టి, వాస్తవికతను బట్టి, నడవగలనే తప్ప ఆకాశంలోనో , పాతాళంలోనో నడవలేను కదా. నేను నల్ల రేగడి మనిషిని. ఇప్పటికీ జొన్నన్నం జొన్న రొట్టెలు తినే మనిషిని . సన్నన్నం వ్యామోహం లేదు. గొధుమ రొట్టెల సంస్కారమూ లేదు. ఆలోచించండి. ప్రజాస్వామికంగా చర్చించండి. సరిదిద్దండి.దిద్దుకోండి."
                                                                                                     -ఇంటర్వ్యూ: కె.ఎస్.రమణ
                                                                                   (డిసెంబర్ 23 ,1996, ఆంధ్రజ్యోతి సాహిత్యవేదిక)

Thursday, February 9, 2012

Sense of Seema :Kethu Viswanatha Reddy

Dr. Kethu Viswanatha Reddy 
Profile Moving beyond the clichéd portrayal of Rayalaseema, Kethu Viswanatha Reddy populates his works with real people from real life
From his texts arises the aroma of the volatile Kadapa geography. Nature's denial and social conflicts naturally defined for long the narratives born in the region where the environment alternated between drought and destitution. From such a milieu emerges its earthy diglossia of which Kethu Viswanatha Reddy is an authoritative spokesperson. He populates his works with real people from real life, inhabiting and trusting the region's angry terrain. For the most part this is the landscape of his stories, characterised by a striking fluency and resonance of prose. Thus Kethu enriches the iconography of Telugu fiction.
His texts, replete with the solidity of Kadapa stone, portray the vulnerable underbelly of the life of a people hungering for a hearing. He creates a world we are familiar with. His early stories Kethu Viswanatha Reddi Kathalu have become part of the region's legendry and won the Sahitya Akademi award for the best Telugu short story collection of the year. Power of the dialogue and the inherent humour in the folksy phrases Kethu employs constitute the kinetics of his art. Fittingly, some stories reflect introspection about the state of the short story.
The early period of his writing reveals his distress at the deep-rooted caste dissensions that permeated every pore of the rural life: agriculture, religion, services and mockery of self-government. Later years saw a shift of focus from the regional scene to a cosmopolitan canvas evident from his second collection.
The Kadapa theme yields place to a much wider canvas, sometimes across continents and cultures. Two stories (Astride Two Worlds and Distances and Proximities) record the delights and dilemmas of the Diaspora, one through the eyes of an old woman visiting her son and daughter-in-law abroad and the other through the eyes of diasporic kids visiting their ancestral home.
The experience leaves both with a sense of void and doubt. These two stories highlight the clash and concord of civilisations. Kadapa becomes a tragic metaphor for an atrophied human condition congealed in Kethu's narratives. They simulate the conflict between the people pervading Kadapa social structures and the alien cultural forces subverting them.
For nearly three decades his stories highlighted the ups and downs of life in Rayalaseema. He appears in many of his stories in different incarnations. In The Face of Love he is a curious writer who meets his waterloo at the hands of an old woman gifted with a wealth of humour and worldly wisdom. She stuns him with her avant-garde interpretation of matrimony. The Custom shows the cancerous spread of casteism to temples of learning. Several stories ( The Peeru House for example) depict the rape and dumbing down of our electoral process, arch stone of our democracy. Dadi is about the breakdown of the primary health machine accounting for unquantified rural mortality.
Kethu's stories are the outpouring of a deeply hurt psyche, made less painful by humour and the gift of literary alchemy. Stories like Attachment show how state credit becomes a noose around the neck of the small farmer by the time it reaches him through a multiplicity of filters. Natal Garment illustrates the inhumanity that awakens in us at the sight of a disrobed woman.
From Kethu's erudite cornucopia have flowed novels, short fiction, literary criticism, and linguistics. The popularity of his narratives rests on a deep understanding of life and its vicissitudes at all levels. I am not mentioning the plethora of awards, laurels and honors that came and continue to come his way purely to show that his literary effort transcends any system of public or private certification. His works shine with their own merit. Absence of cliché in style, idiom, and even subject matter, is his DNA.
One last word of caution: Kadapa in Kethu's stories is not a narrow spatial concept but stands for a world fashioned by the artistry of Viswanatha Reddy. 
-DASU KRISHNAMOORTY
courtesy: THE HINDU
7 th feb, 2012