Tuesday, November 16, 2010

బ్రౌన్ ఆశయాలకు అంకితమవ్వాలి - ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి

 ప్రసంగిస్తున్న డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి గారు
సీపీ బ్రౌన్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లే విధంగా ఆయన జయంతి రోజున అంకితమవ్వాలని ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి అన్నారు. బుధవారం రాత్రి స్థానిక బ్రౌన్ గ్రంథాలయంలో యోగి వేమన యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి అధ్యక్షతన సీపీ బ్రౌన్ 212 జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కేతు విశ్వనాథరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రౌన్ 1992లో కలెక్టర్ అసిస్టెంట్‌గా ఉంటూ కడపలోని కరువు, సాంస్కృతిక స్థితిగతులను వివరిస్తూ లండన్‌కు లేఖలు రాశారన్నారు.
 యోగి వేమన యూనివర్శిటీ వీసీ అర్జుల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బ్రౌన్ తెలుగుభాష, తెలుగుజాతికి ఎనలేని సేవ చేసిన మహానీయుడని కొనియాడారు. వైవీయూలో పరిశోధనలకు అనుగుణంగా మరో బ్రౌన్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న బ్రౌన్ పరిశోధన కేంద్రాన్ని సిటీ క్యాంపస్‌గా, యూనివర్శిటీలో ఏర్పాటు చేసే పరిశోధన కేంద్రాన్ని యూనివర్శిటీ క్యాంపస్‌గా ఉంచుతామన్నారు. యూనివర్శిటీ పరిశోధన కేంద్రంలో తెలుగు, హిస్టరీ, లలితకళల విభాగం, జర్నలిజం అనుసంధానం అవుతాయని తెలిపారు. సీపీ బ్రౌన్ పరిశోధనా కేంద్రంలో మ్యూజియంను ఏర్పాటు చేసి అరుదైన పుస్తకాలు ఉంచుతామన్నారు. జిల్లా చరిత్ర, సాంస్కృతిక, సాహితీ, రాజకీయ చరిత్రలను తరతరాలకు తెలియజేసే విధంగా అన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.
 జానమద్ది హనుమచ్ఛాస్తి మాట్లాడుతూ సీపీ బ్రౌన్ తెలుగు భాషకు చేసిన సేవలను కొనియాడారు. ఈ సమావేశంలో సంగ్రహ నివేదికను రిజిస్ట్రార్, పాలక మండల సభ్యుడు, ఆచార్య సి.శివరామిరెడ్డి సమర్పించారు. అనుసంధానకర్తగా వైవీయూ రీసెర్చి అసిస్టెంట్ కట్టా నరసింహులు వ్యవహరించారు. సీపీ బ్రౌన్ గీతాన్ని వై.మధుసూదన్ ఆలపించారు. బ్రౌన్ సైకత ముఖ చిత్రాన్ని ముద్దనూరు ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్, ఉపాధ్యాయుడు జార్జిలు తీసుకురాగా, సభలో ఆవిష్కరించారు. డాక్టర్ కృష్ణారెడ్డి తమ్ముని కుమారుడు సునీల్‌కుమార్‌రెడ్డి డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్ర్తిని సన్మానించి రూ. 3 వేలు ఆర్థిక సహాయం అందించారు. వేమన నీతి - లోకరీతి అనే పేరుతో వేమన పద్యాలు ఉన్న ఆడియో సీడీలను చిలకలూరిపేటకు చెందిన ఎస్ మహేష్ సభికులకు బహూకరించారు. వేమన సాహిత్యంతోపాటు పద్యాలను ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు.
లోపాలు చూపేవాడే సద్విమర్శకుడు
మంచి విమర్శకుడైనవాడు భజనపరుడు కాదు.. వస్తు విశ్లేషణ కర్త కాదు.. లక్ష్యాన్ని పరిచయం చేసేవాడు, లోపాలను చూపేవాడే సద్విమర్శకుడు అని ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి అన్నారు. బ్రౌన్ జయంతి ఉత్సవాలలో భాగంగా జానమద్ది హనుమచ్ఛాస్ర్తి ఆవిష్కరించిన మన నవలలు-మన కథానికలు అనే పుస్తకాన్ని ఆయన సమీక్షించారు. కథా రచయిత ఆచార్య రాచపాలెం రామచంద్రారెడ్డి 13 నవలలను పరిచయం చేశారన్నారు. ఆయన ఆధునిక సాహిత్య విమర్శకుల్లో నిష్ణాతుడని కొనియాడారు. వైవీయూ వీసీ అర్జుల రామచంద్రారెడ్డి సతీమణి వరలక్షుమ్మ ఈ పుస్తకాన్ని స్వీకరించారు. తెలుగుభాష కోసం జీవితం సమర్పించిన బ్రౌన్ అనే పుస్తకాన్ని శశిశ్రీ రాయగా, రిజిస్ట్రార్ శివరామిరెడ్డి ఆవిష్కరించారు.
 భాషా పరిశోధన వ్యవహార కర్తగా ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి
సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో భాషా పరిశోధన వ్యవహారకర్తగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆచార్య కేతు విశ్వనాథరెడ్డిని నియమించినట్లు యోగి వేమన యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అర్జుల రామచంద్రారెడ్డి తెలిపారు. సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో బుధవారం నిర్వహించిన సాహితీ కార్యక్రమంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. భాషా పరిశోధనలు అంతంత మాత్రంగానే సాగుతున్నందున భాషపై మంచి పట్టు ఉన్న ప్రసిద్ధ కథకుడు, విమర్శకుడు అయిన కేతు విశ్వనాథరెడ్డిని వ్యవహార కర్తగా నియమిస్తూ యూనివర్శిటీ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు.
 ఆయన నియామకంతో భాషా పరిశోధనలు ఆశాజనకంగా ఉంటాయని కమిటీ భావించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కేతు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ భాషా పరిశోధనకు వైస్ ఛాన్సలర్ రామచంద్రారెడ్డి, సాహితీవేత్త జానమద్ది హనుమచ్ఛాస్ర్తి సలహాలతో అవిరళ కృషి చేస్తానన్నారు. బ్రౌన్ చరిత్ర, నిర్మాణం, నిఘంటువు, చంధస్సు, వ్యాకరణం, భాషకు చేసిన కృషితోపాటు జిల్లా వస్తు చరిత్ర, అదనపు చరిత్ర, ముస్లిం రచనలు ఆనాటి రచనల ఆధారంగా సమగ్ర విషయాన్ని సేకరించి పరిశోధనలు చేసి తెలుగుభాషకు గుర్తింపు తెస్తానన్నారు. చరిత్ర, లలిత కళలు, జర్నలిజం ఆధారంగా, రాజకీయ, సాంస్కృతిక పరంగా జిల్లా సమగ్ర చరిత్ర నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.

No comments:

Post a Comment

Write Your Comments here: