Wednesday, January 20, 2010

వేమన సర్వస్వానికి వేమన విశ్వవిద్యాలయం వేదిక కావాలి- అచార్య కేతు విశ్వనాథరెడ్డి


ప్రజాకవి వేమనకు సంబంధించిన సకల సమాచారాన్నీ, సాహిత్యాన్నీ సేకరించి కడపలోని వేమన విశ్వవిద్యాలయంలో వేమన సంగ్రహాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ కథా రచయిత, భాషావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అచార్య కేతు విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. సి.పి.బ్రౌన్ పరిశోధనా కేంద్రంలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రజాకవి, యోగి
వేమన జయంతుత్సవ సభలో ముఖ్య అతిధి గా ఆయన ప్రసంగిస్తూ జనరంజకమైన వేమన పద్యాలకు ప్రామాణిక ప్రతులను కూడా ప్రచురించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వేమన 400 సంవత్సరాల కిందట వేమన ఎండగట్టిన సామజిక రుగ్మతలతొనే ఈనాటికీ బాధపడుతున్నందుకు మనమంతా సిగ్గుపడాల్సి వస్తోందని దాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. తెలుగు సాహిత్య చరిత్రలో వేమన అంతటి వివాదాస్పద వ్యక్తిత్వం మరెవరిలోనూ కనిపించదని ఆయన అభిప్రాయ పడ్డారు. పండితుల నుంచీ పామరుల దాకా కులాలకూ, మతాలకూ అతీతంగా వేమన పద్యాలు జనం నోళ్ళలో నానుతూనే ఉండటం ఆయన పద్యాల విశిస్టతగా కేతు విశ్వనాథ రెడ్డి అభివర్ణించారు. పోతులూరి వీరబ్రహ్మంగారి శిష్యుడయిన సిద్దయ్య వేమన పద్యాలకు ప్రభావితుడై వేమన తాళ పత్రాలను రూపొందించిన విషయమై పరిశోధన సాగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ ప్రజల మధ్య కక్ష్యలు సమసి పోవాలంటే శత్రువును క్షమించే గుణం ఉండాలన్న విషయాన్ని వెమన తన పద్యాల్లో చెప్పాడంటూ " చంప తగిన యట్టి శత్రువు" పద్యాన్ని ఉదహరించారు. సాహిత్య నేత్రం సంపాదకుడు, యోగి వెమన విశ్వవిద్యాలయం పాలకమండళి సభ్యుడు శశిశ్రీ మాట్లాడుతూ వేమన తన పద్యాల ద్వారా సూఫీ తత్వ విచారాన్ని వ్యక్త పరిచారని అభిప్రాయ పడ్డారు. ఈ కోణం పై పరిశోధకులు దృష్టి సారించాలనీ సూచించారు. వేమన విశ్వవిద్యాలయంలో వేమన పీఠాన్ని యేర్పాటు చెస్తానని గతంలో పనిచేసిన ఉప కులపతి ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి హామీ ఇచ్చి మాట నిలుపుకోలేక పోయారని, ఇప్పుడైనా వేమన పీఠం ఏర్పాటునకు కృషి జరగాల్సిన అవసరం ఉందని శశిశ్రీ పేర్కొన్నారు. వేమన విశ్వవిద్యాలయం లలితకళల విభాగం అధిపతి మూల మల్లికార్జున రెడ్డి ప్రసంగిస్తూ వేమనను అచల సిద్ధాంతిగా అభివర్ణించారు. 17 శతాబ్దంలో జీవించిన వేమన, వీరబ్రహ్మం లు ప్రజల్లో నెలకొన్న అజ్ఞానాంధకారాలను తొలగించడంలో తాత్విక భూమికను పోషించారని వివరించారు. వేమన, వీర బ్రహం ల రచనలలోని సారూప్యతను మల్లికార్జున రెడ్డి చక్కగా వివరించారు. వెమన విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకురాలు ఎం.ఎం.వినోదిని ఉపన్యసిస్తూ రాజుల పడక గదుల చుట్టూ , స్త్రీల శరీర వంపుల మీదుగా తచ్చాడుతున్న తెలుగు సాహిత్యాం వేమన రాకతో ప్రగతి పథం పట్టిందని, జనం కడగండ్లనే వేమన తన పద్యాలకు కవితావస్తువులుగా చేసుకున్నారని వివరించారు. అప్పటిదాకా కుళ్ళి కంపుకొడూతున్న వ్యవస్థ కోసం వేమన మందు తీసుకు వచ్చాడని వినోదిని అన్నారు. గత దశాబ్దంలో ఊపందుకున్న దళిత, స్త్రీవాద ఉద్యమాలకు వేమన ఆనాడే బీజాలను వేశాడని ఆమె పేర్కొన్నారు. వైదిక బ్రాహ్మణత్వాన్ని ఎండగట్టిన శూద్రకవిగా వేమనను వినోదిని అభివర్ణించారు. వేమన విశ్వవిద్యాలయం ఇన్ చార్జి వి.సి. ప్రభాకర రావు, బ్రౌన్ గ్రంధాలయ వ్యవస్తాపకుడు జానుమద్ది హనుమచ్చ్శాస్త్రి, బ్రౌన్ పరిశోదనా కేంద్రం సహాయ పరిశోధకులు విద్వాన్ కట్టా నరసిం హులు, రిజిస్ట్రార్ నారాయణ రెడ్డి, ప్రసంగించారు. ఈ సమావెశంలో సాహితీ ప్రముఖులు టక్కోలు మాచి రెడ్డి, అవధానం ఉమా మహేశ్వర శాస్త్రి, తవ్వా ఓబుల్ రెడ్డి, లింగమూర్తి, పార్వతి, గౌరీ శంకర్, మొగిలి చెండు సురేష్, జి. సాంబ శివా రెడ్డి, రాజా సాహేబ్, తదితరులు పాల్గొన్నారు.

1 comment:

  1. this kind of blog always useful for blog readers, it helps people during research. your post is one of the same for blog readers.

    Thesis Papers Writing

    ReplyDelete

Write Your Comments here: