Wednesday, August 8, 2012

పిల్లల పెంపకం లో రూల్సూ, రూళ్ళ కర్రలూ లేవు !

టీచర్లంటే రూల్సూ రూళ్లకర్రలూ అదిలింపులూ బెదిరింపులూ గుర్తొస్తాయి. ప్రొఫెసర్‌గా, సాహిత్యకారుడిగా సుప్రసిద్ధులైన కేతు విశ్వనాథరెడ్డి కాని, ఆయన శ్రీమతి పద్మావతిగాని రూల్సు జోలికి పోలేదు. రూళ్లకర్రల జోలికీ పోలేదు. పిల్లల సమక్షంలో ఉన్నారు. కాని పెత్తనం చేయకుండా పర్యవేక్షణకే ప్రాధాన్యం ఇచ్చారు. విలువలు కొన్ని నేర్పాలి, కొన్ని అలవాటు చేయాలి. ఆ విషయంలో మాత్రం వాళ్లు రాజీ పడలేదు. ఇది వాళ్ల పెంపకం. తెలుసుకోదగ్గ పాఠం. 

ల్లిదండ్రులు పిల్లలకు ఆలంబనగా నిలవాల్సిన సందర్భాలు ఉంటాయి, వాళ్లకు సమస్యలు వస్తే తమకు తాముగా పరిష్కరించుకోమని దూరంగా నిలబడి పర్యవేక్షించాల్సిన సందర్భాలూ ఉంటాయి. ఎక్కడ ఆలంబన అవ్వాలి, ఎక్కడ వికసించనివ్వాలి అన్నది నిర్ణయించుకోవడమే తల్లిదండ్రుల విజ్ఞత అంటారు కేతు విశ్వనాథరెడ్డి, పద్మావతి దంపతులు. మేము పిల్లల్ని అలా పెంచాం అనడం కంటే మా పెంపకంలో వాళ్లు ఇలా పెరిగారనడమే సబబేమో అంటూ తమ అనుభవాలను పంచుకున్నారు. ముందుగా విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ ‘‘నేను ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ పెంచలేదు. వాల్యూ సిస్టమ్‌కి ప్రాధాన్యం ఇచ్చాను. ఇంటి వాతావరణమూ అంతే. మా ఇంటికి వచ్చే మిత్రులు కూడా అలాంటివారే. 

ఏ గూటి చిలుక ఆ పలుకే పలుకుతుందన్నట్లుగా పెరిగారు మా పిల్లలు. ఒక సంఘటన చెబుతాను... అప్పుడు మా అబ్బాయి టెన్త్ క్లాస్. పరిగెడుతూ పడి తలకు దెబ్బ తలిగించుకున్నాడు. డాక్టర్ తలకు కట్టు కట్టి, మందులు రాసిచ్చి మళ్లీ చెకప్‌కు వచ్చే వరకు కట్టు విప్పవద్దన్నారు. ఈ లోపు పరీక్షలు మొదలయ్యాయి. కట్టు తీసేసి పరీక్షకు కూర్చోవలసిందేనని ఎగ్జామినర్ అభ్యంతరం చెప్పారు. కట్టు ముసుగులో కాపీ కొడతారని వాళ్ల సందేహం. నేను యూనివర్శిటీలో ప్రొఫెసర్‌ననీ మా అబ్బాయి మీరనుకునే తప్పు చేయడనీ చెప్పి ఒకవేళ అలా జరిగితే మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి అని పరీక్ష రాయించాను. 

అలా వాడి మీద నాకెంత నమ్మకం ఉందో ఇన్‌డెరైక్ట్‌గా చెప్పాను. మనం పిల్లల్ని నమ్మితే పిల్లలు మనల్ని నమ్ముతారు. మేము హైదరాబాద్‌లో ఉండి పిల్లలను వాళ్లకు ఇష్టమైన కోర్సుల్లో సీటు వచ్చిన చోట హాస్టల్‌లో ఉంచి చదివించాం. శశికాంత్‌కి ఒకసారి హాజరు తగ్గింది. అదే విషయాన్ని ప్రిన్సిపాల్ ఫోన్ చేసి చెప్పారు. ఆ ప్రిన్సిపాల్ నాక్కూడా టీచరే. నేను చెబితే పరీక్షకు కూర్చోనిస్తారు లేదంటే డీటెయిన్ చేయాల్సి ఉంటుందన్నారు. డీటెయిన్ చేయమనే చెప్పాను, ఎందుకంటే పిల్లలకు బాధ్యత తెలియాలి. తన ప్రమేయం లేకుండా దెబ్బతగిలి పరీక్షకు హాజరుకాలేని పరిస్థితికీ, క్లాసులకు హాజరు కాకుండా పరీక్షకు కూర్చోలేని పరిస్థితికీ చాలా తేడా ఉంది. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల తప్పును వెనకేసుకురాకూడదు. తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండాల్సింది ప్రేమే కానీ మమకారం కాదు’’ అన్నారాయన.

మాకు ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. ఎవరూ చదువును నిర్లక్ష్యం చేయలేదు. పెద్దమ్మాయి మాధవీలత గోవాలో లెక్చరర్. అబ్బాయి శశికాంత్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. చిన్నమ్మాయి శిరీష ఎంసిఎ చదివి డల్లాస్‌లో ఉంటోంది.


నా మీద ఆరోపణలు!

పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛనిస్తున్నారని భార్య నుంచి, ప్రేమను పంచలేదని పిల్లల నుంచి ఆక్షేపణలు, ఆరోపణలను ఎదుర్కొన్నానని చాలా మురిపెంగా చెప్తూ నా పిల్లలకు నా మీద ఆరోపణ చేయగలిగినంత స్వాతంత్య్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చానంటారీ ప్రొఫెసర్. ‘‘నేను సాధారణమైన జీవితాన్ని కోరుకుంటాను, కాబట్టి పిల్లలకూ అదే చెబుతుంటాను. సాహిత్య చర్చలకు ఆహ్వానించినప్పుడు స్టార్ హోటళ్లలో బస ఇస్తారు. 



ఆ సౌకర్యాల వ్యామోహంలో పడకూడదు. నాకు స్టార్‌హోటల్ గదిలో ఎలా నిద్రపడుతుందో, నేల మీద చాప వేసినా అలాగే నిద్రపడుతుంది. మా ఊరు వెళితే వేపచెట్టు నీడన కూర్చుంటాను. మనం ఏ స్థాయికి వెళ్లినా మన మూలాలను మర్చిపోకూడదు. చాలా ఏళ్ల కిందట కందుకూరులో గవర్నమెంట్ కాలేజ్‌లో ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడూ అందరం కందుకూరు నుంచి కావలి వెళ్లి వస్తుండేవాళ్లం. ఒకసారి దారిలో జొన్నకంకులను చూసి పెద్దమ్మాయి ‘నాన్నా! అవి ఏం చెట్లు’ అని అడిగింది. అప్పుడే చెప్పాను పిల్లలందరికీ ఏడాదికి కనీసం నెల రోజులైనా పల్లెలో గడపాలని. అప్పట్నించి ఏటా మా ఊరు రంగశాయిపురం వెళ్తున్నాం. కడపజిల్లా ఎర్రగుంట్ల దగ్గర ఉంటుందీ ఊరు’’ అన్నారు సొంతూరి మీద మమకారంతో.



ఒకేరకంగా పెంచాం! చదివించాం!!

కూతుళ్లను, కొడుకుని పెంచిన తల్లిగా పద్మావతి అనుసరించిన పద్ధతి గురించి అడిగినప్పుడు... ‘‘అమ్మాయి, అబ్బాయి అనే తేడా ఎప్పుడూ చూపించలేదు. మంచిచెడులు తెలియచెప్పాల్సిన తీరు అమ్మాయికి అబ్బాయికీ మారదు. మేము కులమతాల గురించి చెప్పలేదు అంటూ ఒక సంఘటనను ఉదహరించారామె. ‘‘మా పెద్దమ్మాయి ఆరవ తరగతిలో ఉన్నప్పుడు మీరేంటోళ్లు అని అడిగారట టీచరు. ఆ ప్రశ్న మా అమ్మాయికి అర్థం కాలేదు. అలాగే ఒకసారి అప్పుడు శశికాంత్ ఏడేళ్ల వాడు. ఇంటికి వచ్చి ఒక పిల్లాడు వాళ్ల అక్కని రాయితో కొట్టాడని చెప్తూ ఆ పిల్లాడి మతాన్ని ప్రస్తావించాడు. వెంటనే మా వారు దెబ్బ గురించి కాకుండా ఆ పిల్లవాడు ఫలానా మతస్తుడని నీకెవరు చెప్పారని అడిగారు. 



స్వతహాగా వికసించనివ్వాలి!

‘‘పిల్లల్లో ఎవరికి వాళ్లకు తమకంటూ ప్రత్యేకమైన మానసిక వికాస తీరు ఉంటుంది. ఏ విషయంలోనూ మరొకరితో పోల్చకూడదు. ప్రతి మనిషీ ప్రత్యేకమైనవాడే. కొడవటిగంటి కుటుంబరావు... సమష్టి కుటుంబ అంశాలు, జన్యుపరమైన, సామాజిక పరమైన అంశాల ప్రభావంతో ఒక వ్యక్తి తయారవుతాడన్నారు. అలాగే గురజాడగారు ‘ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును’ అన్నాడు. మంచివాడిగా మారాలంటే చేయాల్సిన పని ఇదీ అంటూ ఏదీ లేదు, సజ్జనసాంగత్యం మంచి లక్షణాలు నేర్పుతుందని సూక్తి. పిల్లలకు అదే నేర్పించాం. 

- కేతు విశ్వనాథరెడ్డి



‘మా స్కూల్లో చెప్పారు, ఇలాంటి పనులు వాళ్లే చేస్తారని’ అనడంతో మరుసటిరోజు పిల్లలిద్దరినీ వేరే స్కూల్లో చేర్చారు. ఇలాగే మా వారికి కొన్ని నియమాలు ఉన్నాయి. పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయలేదు, పుట్టిన రోజు వేడుకలు చేయలేదు. దేనికీ తాపత్రయపడకూడదనే తత్వం ఆయనది. అదే మా పిల్లలకూ అలవడింది. మా అల్లుళ్లు మా అమ్మాయిలతో ‘మీ అమ్మానాన్నలకు నూటికి నూరు మార్కులు వేయాలి, పిల్లల్ని అలా పెంచడం మీకు రావట్లేదు’ అంటుంటారు’’ అన్నారామె ఒకింత సంతోషంగా. ఆ మాట చెప్తున్నప్పుడు ఆమెలో కనిపించిన సంతోషానికి ఆయన ఆనందించారు - ఆ కాంప్లిమెంట్‌ని అంగీకరిస్తున్నట్టుగా.



- వాకా మంజుల, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి