“…మధ్య తరగతిలో పుట్టి రచయిత జీవితవైరుధ్యాలను అర్థం చేసుకొని వొక స్పష్టమైన సామాజిక అవగాహనను యేర్పరచుకోవడం చాలాకష్టమే, వొకవేళ జీవిత వైరుధ్యాలు అర్థమైనా, సామాజిక అవగాహన యేర్పడినా జీవితాన్ని వాస్తవంగా, శిల్పసంపన్నంగా, హృదయ సంస్కార ప్రేరకంగా చిత్రించడం మరొక పెద్దచిక్కు సృజనాత్మక శక్తీ, విమర్శనా దృష్టీ దీనికి కావాలి. వీటికి తోడు శాస్త్రీయ దృక్పథమూ, చిత్తశుద్ధీ వుంటేనే తప్ప వాస్తవికతావాద సాహిత్య సృష్టి చేయడం అసాధ్యం”.
-కేతు విశ్వనాథరెడ్డి (‘జప్తు’ కథాసంపుటికి ముందుమాట-1974)
అది కథ కావచ్చు, నవల కావచ్చు మధ్య తరగతి నేపథ్యం నుంచి ఎదిగొచ్చిన రచయితగా సృజనాత్మక సాహిత్య రచనలో తానెదుర్కొన్న సవాళ్ళ గురించి, వాటినుంచి బయటపడడానికి తాను సమకూర్చుకొన్న పరికరాల గురించే కేతువిశ్వనాథరెడ్డి చాలా స్పష్టంగానే పేర్కొన్నారు. స్వీయానుభవ ప్రపంచానికి బయటనున్న జీవితాన్ని వాస్తవికతవాద సాహిత్యంగా మలచడంలో యే రచయిత అయినా యెదుర్కోనే యిబ్బందే యిది దాన్ని అధిగమించగల ప్రాపంచిక దృక్పథం కలిగివుండడం వల్లనే విశ్వనాథరెడ్డి సమకాలీన రచయితల్లో అగ్రగామిగా నిలబడగలిగారు.
కథారచయితగా మొదలై, కథకుడిగానే ప్రస్థానం కొనసాగిస్తూ రాయలసీమ ప్రాతినిధ్య రచయితగా కీర్తిగడించిన విశ్వనాథరెడ్డి రచించిన అరుదైన నవలలలు -వేర్లు, భోధి. ఈ రెండు నవలలు రెండు భిన్న ప్రపంచాలకు చెందినవి. జీవితానికి చెందిన తాత్త్వికతని రెండు వేర్వేరు కోణాల్లోంచి ఆవిష్కరించినవి. ఉన్నత విద్యనభ్యసించి విశ్వవిద్యాలయం నుండి బయటపడ్డ భిన్న సామాజిక వర్గాలకు చెందిన యిద్దరు నిరుద్యోగ యువకుల వుద్వేగభరితమైన సంక్లిష్ట జీవితాన్ని, మానసిక సంఘర్షణని విమర్శనాత్మకంగా కళ్ళకు కట్టిన యీ రెండు నవలలూ ఆయన కథల నీడలో వెలుగులోకి రాలేదంటే తప్పుకాదేమో!
జీవిత వైరుధ్యాల్ని అర్థం చేసుకోగల సామాజిక అవగాహన, శాస్త్రీయ దృక్ఫథం, చిత్తశుద్ధి వొక నిబద్ధ రచయితకుండాల్సిన అర్హతలన్నీ కేతులో నిండుగా వున్నాయనడానికి యీ రెండు నవలలూ నిలువెత్తు వుదాహరణలే అయినప్పటికీ ‘వేర్లు’ నవల చదువుతున్నంతసేపూ ప్రత్యక్ష 80లోనూ అవి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ‘వేర్లు’ రాసేనాటికి (1978) విశ్వనాథరెడ్డి కథకుడిగా తెలుగు సాహిత్యంలో యింకా తనదైన ముద్రని వేసే ప్రయత్నంలోనే వున్నారు. ఆయనకి పేరుతెచ్చిన ‘నమ్ముకొన్ననేల’, ‘కూలిన బురుజు’ లాంటి కథలు ఆ తర్వాతే వచ్చాయి. ‘వెనకా ముందూ’ లాంటి కథల్లో ఆయన చేసిన నిష్పాక్షికమైన విలువల ప్రకటనలు ఆయనలోని నిర్భీతి తత్వాన్ని తెలియజేసాయి. ‘మార్పు’, ‘సానుభూతి’ కథల ద్వారా రచయితగా తానెటు నిలబడదల్చుకొన్నారో, తన సాహిత్య దృక్పథం యేమిటో నిర్ధ్వంద్వంగా స్పష్టం చేశారు. అయినప్పటికీ వొక దళిత యువకుడి జీవిత సంఘర్షణని నవలకు యితివృత్తంగా యెన్నుకొని తనది కాని ప్రపంచాన్ని, తనవి కాని అనుభవాల్ని రాయడానికి పూనుకోవడం వొకవిధంగా సాహసమే. అదేకాలంలో కేశవరెడ్డి ‘ఇన్‌క్రెడిబుల్ గాడెస్’ (1977) దళిత జీవితాన్ని చిత్రించినప్పుటికీ ఆ నవల సంఘటన ప్రధానంగా సాగింది. విశ్వనాథరెడ్డి ‘వేర్లు’ సంఘర్షణ ప్రధానంగా రూపొందింది.
ఈ నవలలో నాయకుడు వెంకట్రాముడు ఆంత్రోపాలజిలో పి.జి. చేసిన వొక మాదిగ యువకుడు. తాను చదివిన చదువువల్ల అతడు తన కులంలో యిమడలేదు.సామాజిక ఆర్థిక అసమానతల చట్రంలో స్వశక్తితో యెదిగే ప్రయత్నంలోనలిగిపోయి, జీవితానికి సంబంధించిన అన్ని రకాల అభద్రతనీ అనుభవిస్తాడు. తనకు తెలియకుండానే పరాయీకరణకు గురై దాన్నుంచి బయటపడే దారులు కనపడక జీవితాన్ని ఓడిపోతాడు. చివరకు యిదంతా యిలా ఎందుకు జరుగుతోందని అతనిలో ‘సత్యశోధన’ మొదలవుతుంది. స్థూలంగా ఇదీ వేర్లు నవలలోని కథ.
తెలుగు నేలమీద దళితుని పరాయీకరణను- అందులోని హింసనీ అమానవీయతని యింత లోతుగా చిత్రించిన నవల అంతకుముందు రాలేదు. తాను చదువుకొన్న చదువులవల్ల తాను తన యింట్లోనే పరాయి వాణ్ణయిపోయనన్న స్పృహ వెంకట్రాముడికి వుంది. సొంత మనుషులకు అతను మానసికంగా, సాంస్కృతికంగా దూరమైపోయాడు. శరీరశ్రమలో సైతం పాలుపంచుకోలేని నిర్వ్యాపారతకు గురయ్యాడు. తండ్రి మాదిరి కుల వృత్తి చెయ్యలేడు. అన్న మాదిరి ముగ్గురాళ్ళగని పనిలోకి వెళ్ళలేడు. చదువు అబ్బని ఇద్దరు తమ్ముళ్ళ మాదిరి రైతుల యిళ్ళల్లో పేడకళ్ళు తియ్యలేడు. గంజు యెత్తలేడు, గొడ్డుకాయలేడు.తల్లి చెల్లెళ్ళ మాదిరి ముగ్గురాళ్ళ గ్రేడింగ్‌కు తాను వెళ్ళలేడు, మాదిగవాడ, అక్కడి మనుషుల జీవితం, సంస్కృతి అతనికి భరింపరానివీ, జగుప్స కల్గించేవి అయ్యాయి. ‘తనకూ తన వాళ్ళకూ మధ్యయేదో అంతరం’ అతని అనుభవానికి వస్తుంది గానీ ఆ సంబంధాలను నిలుపుకొనే ప్రయత్నం అతను చెయ్యడు. హింసాపూరితమైన యీ పరాయీకరణకి మూలాలు ఎక్కడ వున్నాయో అతనికి తెలియదు.తన జాతిగురించి, సమూహం నుంచి తనను తాను స్వయంగా వెలివేసుకుంటాడు. తోటి మనుషుల్లో కలవలేని రోజుల్లోనే మొదలైంది. కులం పేర్న యెదురయ్యే అవహేళనల్ని, అవమానాల్ని తప్పించుకొనేందుకు అతను పుస్తకాల్లో తల దాచుకొన్నాడు. అవి కూడా క్లాసు పుస్తకాలే. మానవశాస్త్రంలో మాస్టర్స్ చేసినా అతనికి అంబేద్కర్ జీవిత చరిత్ర వంటి పుస్తకాల వునికి కూడా తెలియదు. కులాల సమాజం అతణ్ణి లోలోపలికి ముడుచుకుపోయేలా చేసింది. జీవితాన్ని జయించాలనే తపనలో అతను జీవితాన్నే కోల్పోయాడు.
మీదిపెంట్ల గ్రామం, జిల్లా కేంద్రం కడప, రాజధాని హైదరాబాదు-మూడు కథాస్థలాల్లోనూ వెంకట్రాముడు కులపరంగా ఎదుర్కొన్న న్యూనత, దాన్ని జయించడానికి పడిన సంఘర్షణ భయంకరమైనవి. చచ్చిన గొడ్డు మాంసం తినేవాళ్లు, మడత నాలికగాళ్ళు, గవర్నమెంటు దత్తపుత్రులు, స్కాలర్‌షిప్‌లతో వొళ్ళు బలిసి వాళ్ళు వంటి ముద్రలతో చిన్నప్పటినుంచి -ఊళ్ళో, స్కూల్లో, హాస్టల్లో, యూనివర్సిటిలో అనుభవించిన కులహైన్యం, అవమానాలు అతనిలో క్రోధానికి కారణమయ్యాయి. సొంతపేర్లు సైతం లేని అస్తిత్వవేదనలో అతను రగిలిపోయాడు. అతని మాటల్లోనే చెప్పాలంటే ‘ఆ రకమైన రొంపి అనుభవానికొస్తే గానీ, అందులోని యాతన అర్థంకాదు…’ తిరగబడలేని తమ తరతరాల కుల రక్తం మీద, కుల మనస్తత్వం మీద, గుండెను దహించే ఆత్మన్యూనతాభావం మీద అసహ్యం’ కలిగింది. గ్రూప్ వన్ ద్వారా ఆర్‌డివో అయి తమని సాంఘికంగా అణచివేసే వాళ్ళ మీద అధిపత్యం సాధించాలనుకొంటాడు.
ఉద్యోగం వేట కూడా ఎండమావులవెంట పరుగేనని చివరికి గ్రహిస్తాడు.తన అభివృద్ధికి అడ్డం తగిలేది రాజకీయంగా, సామాజికంగా ఎదిగిన తన కులంలోని క్రీమీలేయర్‌లో వున్న ఎమ్మెల్యే పెంచలయ్య. డిఆర్వో ఓబయ్య లాంటి స్వార్థ శక్తులేనని గ్రహించి విస్తుపోతాడు. వాళ్ళందరికీ ‘కులనిర్మూలన సమితి’ వంటి సంస్థలు మాస్క్‌లుగా ఉపయోగపడతాయనే అవగాన కూడ కలుగుతుంది. వాసు వంటి అగ్రకులానికి చెందిన సానుభూతిపరుల చేతుల్లోనూ, చలపతి వంటి రాజకీయ నాయకుల కనుసన్నల్లోనూ నడిచే ‘కుల నిర్మూలన సమితి’ని దగ్గరగా చూశాకా దాన్ని నిర్వహించే మనుషుల స్వార్థం, వాళ్ళ ఆలోచనల్లోని డొల్లతనం మాత్రమే కాదు. ఆ సంఘం పరిమితిలు కూడా అతనికి తెలుస్తాయి. కానీ వాస్తవాల్ని స్వీకరించే చైతన్యం అతనికి యేర్పడలేదు. క్లాస్‌మేట్ చంద్రవతి చూపిన కాలక్షేపం అభిమానాన్ని ప్రేమ అనుకొని కులాంతర వివాహం ద్వారా కులహీనతని అధిగమించవచ్చనే భ్రమలో వుంటాడు.
పరాయీకరణని జయించే ప్రయత్నంలో వెంకట్రాముడిలాండి వాళ్ళు మరింత పరాయీకరణలో కూరుకుపోవడాన్ని ఆయాసందర్భాల్లో కేతు అద్భుతంగా పట్టుకోగలిగారు.
వెంకట్రాముడికి దిశానిర్దేశం చేసే సామాజిక ఉద్యమాలు ఆ రోజుల్లో రాయలసీమలో లేవు. ఆదేకాలంలో ఉత్తర తెలంగాణ పల్లెలు రైతుకూలి పోరాటాలతో అట్టుడికి పోతున్నాయి. ఆ కల్లోల దశాబ్దంలోనే అల్లం రాజయ్య వెలుగులోకివచ్చారు. వెంకట్రాముడి లాంటియువకులు ఉద్యమాల్లో మమేకమయ్యారు. రాజయ్య కొలిమంటుకొన్నది (78-79) నవల నిర్థిష్ట సమాజంలో చోటు చేసుకొన్న సామూహిక కల్లోలాన్ని రికార్డు చేస్తే, విశ్వనాథరెడ్డి ‘వేర్లు’ వ్యక్తుల మానసిక సంఘర్షణకు అద్ధం పట్టింది.
ముప్పై సంవత్సరాలకు వూర్వం – దళిత అస్తిత్వ స్పృహ వంటి మాటలు సైతం లేని రోజుల్లో దళితాంతరంగ కల్లోలాన్ని, మానసిక సంఘర్షణని, అస్తిత్వ వేదనని అద్భుతంగా ఆవిష్కరించగలగడానికి కేతు యీ నవలని కేవలం దళిత సానుభూతితో మాత్రమే రాయలేదు. అనితరసాధ్యమైన వొక సహానుభూతితో రచయితగా ఆయన దళిత హృదయానికి దగ్గర కాగలిగారు. దళిత సంస్కృతిని కడుపులో తిప్పే కసరు వాసనల్తో సహా చూడగలిగారు.
ఆ సహానుభూతి నుంచే సంక్షేమ హాస్టళ్ళని పట్టణాల్లో నగరాల్లో వెలసిన వెలివాడలుగా అర్థం చేసుకోగలిగారు. అక్కడివిద్యార్థులు ఎదుర్కొనే దుర్భర, దయనీయ పరిస్థితుల్ని ఎత్తి చూపారు. 1978లో ‘వేర్లు’ నవలలో కేతు వర్ణించిన హాస్టళ్ల పరిస్థితికి, 2005లో వచ్చిన కనుంపల్లి రాజారాం ‘ఎదురగ్గి’ నవలలో పరిస్థితికి తేడా యేంలేదు. అధికార మార్పిళ్ళు ఎన్ని జరిగినా సంక్షేమంలో అవినీతి మారలేదు. దళితులపై అణచివేత రాజకీయలు మారలేదు.వాటిని ఎదుర్కొని నిలవరించే ‘వీరదాసు’లాంటి వ్యక్తుల చైతన్యమే తర్వాతి కాలంలో రాయలసీమలో సైతం సామూహిక ఉద్యమంగా రూపొందింది. సంక్షేమ హాస్టళ్ళు విప్లవ విద్యార్థి రాజకీయాలకు పురిటి గదులయ్యాయి, వాటి బీజాల్ని కేతు నికార్సయిన వాస్తవికతావాదిగా ‘వేర్లు’ లో దర్శించగలిగారు.
‘దండోరా’ వంటి ఉద్యమాల్లో సైతం నిర్లక్ష్యానికి గురయిన మాదిగ సాంస్కృతిక కోణాల్ని కేతు విశ్వనాథరెడ్డి ‘వేర్లు’ నవల ద్వారా అపూర్వంగా అవిష్కరించారు. అందులో భాగంగానే వెంకట్రాముడి తండ్రి సుబ్బడు చెప్పిన ఆది జాంబవుడి కథ ఈ నవలలో వొక ప్రయోజనాన్ని వుద్దేశించి చోటుచేసుకొంది. మాలమాదిగల సాంస్కృతిక మూలాల్ని తెలిపే యీ సమాంతర పురాణం దళితలు ఆత్మగౌరవ ప్రకటనకు మరో రూపం. ‘మనంలేంది రైతులు బతకలేరు, మనంలేంది దేవర్లు లేవు. అందుకనే మన గొప్ప మనది’ అన్న సుబ్బడి ముక్తాయింపులో యిది వ్యక్తమౌతుంది. ‘సరే, మరి -వాళ్ళెందుకు మనల్ని హీనంగా చూస్తారు?’ అన్న వెంకట్రాముడి ప్రశ్న తరతరాలుగా దళితులపై అమలయ్యే అణచివేతకు మూలాల్ని అన్వేషిస్తుంది. ఈ అన్వేషణే ‘వేర్లు’ నవల నిండా పరచుకొని వుంది. మార్క్సు చెప్పిన శ్రమ పరాయికరణ సూత్రం యిక్కడ సమాధానం అవుతుంది. దాని తెలుసుకొనే దిశగానే వెంకట్రాముడి ‘సత్యశోధన’ సాగుతుంది. ఆ సూత్రాన్ని జీవితానికి అన్వయించుకోగలిగినప్పుడు మాత్రమే ‘హరిజనుల జీవితం ఎన్ని రూల్సుకు లోబడి వుంది’ అని అతన్లో పుట్టిన మరో ప్రశ్నకు కూడా సమాధానం లభిస్తుంది. అప్పుడు మాత్రమే ఊళ్ళో రెడ్ల కుటుంబాల అధిపత్యపోరులో, ముఠా రాజకీయాల్లో కింది కులాలకు చెందిన మాలోళ్ళు వడ్లోళ్ళు, గొల్లోళ్ళు పావులుగా మారి మట్టికొట్టుకుపోయిన వైనాన్ని సైతం అతను అర్థం చేసుకోగలుగుతాడు. అప్పుడు మాత్రమే రోషిరెడ్డి చేతుల్లో మోసపోయిన దేవదానం చెల్లెలు మేరిపట్ల సానుభూతి చూపగలుగుతాడు. అప్పుడు మాత్రమే తను పుట్టి పెరిగిన సమాజంలో, వాళ్ళ కష్టాల్లో తను భాగం కాగలడు. వాళ్ళ గొడ్డు జీవితం పట్ల అనుకంప చూపగలడు. చదువుతో, చదువు పెంచిన వేరు సంస్కారంతో, స్కాలర్‌షిప్‌లతో, అవి పెంచిన దయ్యాల మర్రిచెట్టు ఊడల్లాంటి భ్రమలతో, స్వార్థంతో, దురాశతో తను కోల్పోయిన మానవత్వాన్ని తిరిగి నిలబెట్టుకోగలడు. అప్పుడు మాత్రమే తన చుట్టూ వున్న జీవితానికీ, తను కొత్తగా యేర్పరచుకొన్న సంస్కారానికి పునాదులేవో ఆలోచించుకోగలుగుతాడు.
ప్రస్తుతం అమల్లోవున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ చట్రాలు వెంకట్రాముడి లాంటి వాళ్ళు తమ వాళ్ళనుండి దూరమవడానికీ దోహదం చేస్తాయి. ఆ చట్రాన్ని బద్దలు చేయగల వీరదాసుల్ని నవల్లో పాత్రలుగా చేయడం ద్వారా కేతు భవిష్యత్తుని చూడగలిగారు. దళితోద్యమాలు వీరదాసు -వెంకట్రాముల కలయికతోనే బలపడతాయి. అయితే ఆ వెంకటేశు, పెదవోబులు, మునిమామ, సుబ్బడు లాంటి వాడదళితుల్ని వదిలి యింకా ఓబయ్య, పెంచలయ్య, పుల్లమ్మ, చలపతుల చుట్టూనే తిరుగుతున్నాయి కదా అనే ఆవేదన సైతం నవలని యివాళ్టి పరిస్థితులకు అన్వయించుకొన్నపుడు కలగకమానదు.
ఆ విధంగా మార్క్సిజం వెలుగులో దళితుల పరాయికరణని చిత్రించిన ‘వేర్లు’ యివాళ్టికి కూడా ప్రాసంగికంగానే వుంది. మాదిగ ఆత్మగౌరవ పోరాట స్పూర్తితో నాగప్పగారి సుందర్రాజు బోడెద్దుకత (మాదిగోడుకతలు)కి రెండు దశాబ్దాల వూర్వమే మాదిగ వాడల్లోకి వెళ్ళి గొడ్డు మాంసం కోతని కేతు వర్ణించగలిగారు. మాలపిల్ల మాదిగవాడల్లో రెండు కులాలకు వేర్వేరు మంచి నీళ్ళ బావులుండే విషయాన్ని ప్రస్తావించడమే కాదు. దానిలోని అమానుషతని ప్రశ్నించారు. వీటన్నిటినీ సాహిత్యీకరించగలగడానికి కారణం అయనకున్న ప్రాపంచిక దృక్పథమే- ఆ దృక్పథం ఆయనకు మార్క్సిజం తత్త్వశాస్త్రంగా ఆధ్యయనం చేయడంవలనే కలిగింది. రారాలాంటి వారి సాహచర్యం అందుకు తోడ్పడిన మాట నిజమే కానీ సృజనాత్మక శక్తికి విమర్శనాదృష్టిని, పరిశోధనాభినివేశాన్ని జోడించడం ద్వారానే అది సాధ్యమైంది. రచయితగా తన చుట్టూ వున్న మానవ సమాజంలోని చలనాన్ని పట్టుకోగల శాస్త్రీయ దృక్పథం, సైద్దాంతిక అవగాహన కేతులో మెండుగా వుండటంవల్లనే ‘వేర్లు’ నవల అచ్చమైన శిల్పసంపన్నమైన దళితనవలగా రూపొందింది.
విశ్వనాథరెడ్డి రెండోనవల ‘బోధి’ 1984లో వెలువడింది కథాకాలం -1962కి కొంచెం అటూఇటూ. బోధిలో ప్రధాన పాత్ర చెన్నకేశవ – మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందినవాడు. జీవితంలో నైతిక విలువలగురించి, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల్లో వెల్లివిరియాల్సిన స్వచ్ఛమైన ప్రేమ గురించి చెన్నకేశవ మనసులో కలిగే ఆలోచనలు, అతని జీవిత ఆచరణ నవలకు ప్రధాన వస్తువు. వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎం.ఎ. ఎకనామిక్స్ చేసి హైదరాబాదులో చోటమోటా జర్నలిస్టుగా ఉద్యోగ జీవితం మొదలు పెట్టిన చెన్నకేశవ మిత్రులు శ్రీపతి అజీజ్‌ల దృష్టిలో కుటుంబరావుని చదివి చెడిపోయినవాడు. వాళ్ళిద్దరూ చలాన్ని అడ్డం పెట్టుకొన్న స్వేచ్ఛా జీవులు. చెన్నకేశవకు చలంపట్ల, ప్రేమ పట్ల స్పష్టమైన అభిప్రాయాలున్నాయి.
‘ప్రేమ పరస్పర సాహచర్యం-ఇద్దరి జీవితాన్ని వెలిగించేది – ఇద్దరి సంస్కారాన్ని పెంచేదీ’ అనే చెన్నకేశవకు తండ్రి వివాహేతర సంబంధాలపట్ల అసహ్యం వుంది. తండ్రి ప్రవర్తనలవల్ల యింట్లో జరిగే ఘర్షణలను చూసి అటువంటి దాంపత్య జీవితం తనకు వద్దని అనుకొంటాడు.
నిజమైన ప్రేమ లేకుండా స్త్రీని తాకకూడదు – అని నిర్దారణకు వస్తాడు. ‘ఒక మగవాడు ఇద్దర్నో ముగ్గుర్నో ప్రేమిస్తే లోకం ఏమీ అనుకోనప్పుడు ఒక స్త్రీ ఇద్దర్నో ముగ్గుర్నో ప్రేమించకూడదా’ అన్న క్లాస్‌మేట్ రాణి గాలివాటం జీవితం పట్ల సానుభూతి కల్గివుంటాడు. స్త్రీ పురుషుల విశృంఖల శృంగారాన్ని అంగీకరించాడు. అన్ని విలువల్ని వదిలి అక్రమ మార్గాల్లో పైకెదిగే మిత్రుల్ని ద్వేషించే వాళ్ళని వదులుకొంటాడు. వాళ్ళతో నింఫోమానియక్ అని నిందకు గురైన రాణి స్నేహంలో మంచినే చూశాడు. రాణి పరిచయం చేసిన ప్రసూనకు మానసికంగా దగ్గరయి తాను నిర్వచించుకొన్న నిజమైన ప్రేమను ఆచరణలో పెడతాడు.
ఈ నవల ఒక విధంగా విశ్వనాథరెడ్డి స్వీయానుభవాల్లోంచి పుట్టినట్లుంటుంది. చెన్నకేశవలోని ఆదర్శభావాలు, కమ్యూనిస్టు భావజాలంవైపు ఆకర్షణ, జర్నలిస్టు జీవితం, తర్వాత ఆధ్యాపకవృత్తి యివన్ని ఆయన తన జీవితం నుంచే తీసుకొన్నారు. నవలలో చర్చించిన విషయాల్లో చలానికి కుటుంబరావుతో చెక్ చెప్పినట్టు తోస్తుంది. చలం 1972 ఫిబ్రవరి 5న సంభవించే జగత్ ప్రళయం నుంచి తప్పించుకోడానికి శ్రీశ్రీని అరుణాచలం రమ్మని చెప్పిన ఉదంతాన్ని హేళన చెయ్యడం రచయితలోని హైతిక దృష్టికి వొక ఉదాహణ మాత్రమే. ఏక కాలంలో స్త్రీ పురుషుల మధ్య బహుసంబంధాల గురించి మిత్రులు శ్రీపతి, అజీజ్‌లతో, ప్రసూనతో చెసిన చర్చలు కూడా హేతుబద్దంగానే సాగినప్పటికీ -అవి ఉద్వేగ ప్రధానంగా కూడా వుంటాయి. ఆ ఉద్వేగ గుణమే అతణ్ని ప్రసూనకు మరింత దగ్గర చేస్తుంది.
రాణి స్వేచ్చావర్తనని సింహం నోట్లో తలపెట్టే సర్కస్ ఫీట్‌గా పేర్కొన్నప్పటికీ ఆమె మరణం చెన్నకేశవని ఎంతో కదలిస్తుంది. చలం స్త్రీలు కూడా ఎక్కడా సుఖపడలేదు. – పైగా చివరికి శిక్షలనుభవించారని – విమర్శకుల్లో ఒక అభిప్రాయం వుంది. విశ్వనాథరెడ్డి రాణికి చావుని విధించకుండా వుంటే బాగుండేది. చెన్నకేశవ కూడా సంతోషించేవాడు. ఒక మంచి విలువని గెలిపించడానికి – చెడ్డ విలువని ఓడించాలి గానీ – ఆ వ్యక్తిని కాదు.
ఈ నవల పేరుని రచయిత వాచ్యం చేస్తారు. చెన్నకేశవ తన ఊరికి ఎగువ తోటలవైపు వెళ్ళే దారిపక్క రావి చెట్టు దగ్గర క్షణికమైన కామోద్రేకాలకు- శాశ్వత ప్రేమకు సంబంధించిన సంఘర్ణణకు లోనవుతాడు. యౌవనోద్వేగంలో వొకబలమైన ఆకర్షణలో రాధా అనే అమ్మాయిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తప్పు తెలుసుకొని పశ్చాత్తాపానికి గురువుతాడు. దరిమిలా ప్రేమ విషయమై స్వచ్ఛత గురించి కొన్ని తీర్మానాలు చేసుకొంటాడు. బోధివృక్షం జ్ఞానోదయానికి పాదయింది. ఆ జ్జానం చెన్నకేశవ ఆచరణలో ప్రతిఫలిస్తూ వుంటుంది.తను ప్రేమించిన ప్రసూనతో ఆ జ్ఞానాన్ని ఎంతో నిజాయితీ పంచుకొంటాడు.
కథనాయకుడు దృష్ట్యా ‘బోధి’ మోదాంతనవల. ‘వేర్లు’ వెంకట్రాముడి ఓటమి విషాదం కలిగిస్తుంది గానీ – ఆ తర్వాతి అతని ఆచరణ గురించి పాఠకుడిలో ఆలోచన మొదలౌతుంది.
నిజానికి చెన్నకేశవ వెంకట్రాముల జీవితానికి, ఆలోచనలకు చాలా తేడా వుంది. వెంకట్రాముడిది అస్తిత్వ సమస్య. చెన్నాకేశవది ఆదర్శాల, విలువల సమస్య. కరువుల రాయలసీమలోనే పుట్టినప్పటికీ చెన్నకేశవకు కులం, పొలం బలం వున్నాయి. వెంకట్రాముడు కూడా యవ్వన సహజమైన ప్రేమలో కూరుకుపోయినప్పటీ కులం కారణంగా అది అపహాస్యానికి గురవుతుంది. మాదిగవాడలో చెన్నకేశవలాంటి వాళ్లు కోరుకునే లేదా వెంకట్రాముడు కొత్తగా నేర్చుకొన్న సంస్కారంతో ఆశించే ప్రేమలకూ, కన్నీళ్లకూ, బాధపడడాలకూ తీరిక వుండదు. అది వెంకట్రాముడికి స్వయంగా అనుభవంలోకి వచ్చిన కఠోర సత్యం. ఇద్దరూ సమకాలీనులే అయినప్పటికీ వారి మన: ప్రపంచాల్లో కదిలే ఆలోచనలు వేరు. ఒకే సమాజంలోని రెండు ప్రపంచాల జీవన సంక్లిష్ఠతని రెండు నవలలు పాఠకుల ముందుంచ గలిగాయి.
రూపం దృష్ట్యా రెండు నవలలూ చిన్నవే అయినప్పటికీ విషయ విస్తృతిపరంగానూ పాత్ర చిత్రణ ఇతివృత్త నిర్వహణరీత్య రెండూ నవలా లక్షణాల్ని కలిగివున్నాయి. ప్రచురణ క్రమంలో బోధి 1984లో వెలువడినప్పటికీ రచనా పద్దతి పరిణతి చూస్తే ‘వేర్లు. వెనకసిరి నవలగా తోస్తుంది. నిజానికి వస్తురీత్యా. 70ల నాటికైనా ‘బోధి’లో అంత వైవిధ్యం కనిపించదు. వేర్లు నవలలో లాగా సంఘర్షణ కూడా లేదు. పాత్రల మధ్య వైరుధ్యాలు చిత్రితమైనప్పుటీకీ అవి సంఘటనలకు దారితీయవు. ఇది బోదిలో కనపించే ప్రధానమైన లోటే అనిపించినప్పటికీ జీవితంపట్ల చెన్నకేశవ దృక్పథాలు, నిజాయితీ ముచ్చటగొలుపుతాయి. చెన్నకేశవలో రచయితే అడుగుడుగునా కనపించడంతో కేతు వ్యక్తిత్వం కూడా మనకు యీ నవలల్లో రూపుకడుతుంది. ఇది యీ నవల ప్రత్యేకత.
స్వీయ జీవినానుభవాలను సృజనాత్మకంగా మలచడంలో రచయిత ఎదుర్కొనే వొక రకమైన యిబ్బంది కూడా కేతు బోధి రాసినప్పుడు అనుభవించినట్లు కనిపిస్తుంది. ఎంతో మెలకువతో తాటస్థ్యాన్ని పాటించిన్పటికీ రచయిత కంఠస్వరం చెన్నకేశవలో దొరికిపోతుంది.
రెండు నవలల్లో ప్రసక్తాను ప్రసక్తంగా రాయలసీమలో చోటు చేసుకొంటున్న ఉత్పత్తి సంబంధాల్లో వస్తున్న మార్పులు కూడా చిత్రితమయ్యాయి. అవే తర్వాతి కాలంలో కేతు కథలకు ప్రధాన వస్తువులయ్యాయి.
రచయితగా కేతు సాహిత్య సామాజిక నిబద్దతనీ, వ్యక్తిత్వాన్నీ అర్థం చేసుకోవడానికీ వేర్లు, బోధి నవలలు ఎంతగానో తోడ్పడుతాయి.
-ఎ.కె.ప్రభాకర్
-"ప్రాణహిత.ఆర్గ్ " సౌజన్యంతో..